Share News

రేపు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో ఈసీఐ సమావేశం

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:33 AM

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 24న అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల(ఎ్‌సఈసీ)తో సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ అధ్యక్షతన ఢిల్లీలో....

రేపు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో ఈసీఐ సమావేశం

  • కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అధ్యక్షతన ఢిల్లీలో రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌

  • కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 24న అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల(ఎ్‌సఈసీ)తో సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేంద్ర ఎన్నికల విభాగాలతోపాటు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాల కమిషనర్లు, సాంకేతిక నిపుణులు, అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈవో) పాల్గొననున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో జాతీయ స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఇంతకు ముందు 1999లో నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపడుతున్న నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత మళ్లీ సమావేశంకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని సంబంధిత విభాగాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణ వ్యూహాలు, లాజిస్టిక్స్‌, చట్టపరమైన అంశాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని చాటేలా చర్చలు జరగనున్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘాలు.. పంచాయతీలు, మునిసిపాలిటీ, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కలిగి ఉన్నాయి. ఆర్టికల్‌ 243కే, 243జెడ్‌ఏ కింద ఎస్‌ఈసీకి ఉన్న అధికారాలు, ఓటర్ల జాబితా తయారీలో 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం అమలు, ఈవీఎంల పనితీరు, ఓటర్ల జాబితా రూపకల్పన, సాంకేతికత వినియోగం వంటి అంశాలపైనా ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 23 , 2026 | 02:33 AM