Share News

టీఆర్‌ఎస్‌ పేరు ఇవ్వలేం

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:44 AM

కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కవితకు కేంద్ర ఎన్నికల సంఘం...

టీఆర్‌ఎస్‌ పేరు ఇవ్వలేం

  • కవిత కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కవితకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షాకిచ్చింది. ‘టీఆర్‌ఎస్‌’ అనే సంక్షిప్త పేరుపై తమకు అనేక అభ్యంతరాలు వచ్చాయని, అందువల్లఆ పార్టీ పేరును కేటాయించలేమని ఆమెకు ఇటీవల ఈసీ లేఖ రాసింది. ప్రత్యామ్నాయంగా 3పేర్లు పంపించాలని సూచించింది. ఆ లేఖకు కవిత సమాధానం కూడా ఇచ్చినట్లు సమాచారం. కవితకు తెలంగాణ రక్షణ సేన పేరును కేటాయించడంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అని ఈసీ కొంతకాలం క్రితం బహిరంగ ప్రకటన ఇచ్చింది. అప్పట్లో రెండు అభ్యంతరాలు వచ్చాయి. ఒకటి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ జడ్పీటీసీ నుంచి వచ్చింది. తాను అప్పటికే తెలంగాణ రాజ్యసమితి (టీఆర్‌ఎస్‌) పేరుతో పార్టీ పెట్టానని, అందువల్ల టీఆర్‌ఎస్‌ అన్న సంక్షిప్త నామంతో మరో పార్టీ ఉంటేఇబ్బంది అవుతుందని తెలిపారు. అదేవిధంగా మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతం నుంచి మరో అభ్యంతరం వచ్చింది. ఈ రెండింటిపైనా కవిత ఎన్నికల సంఘానికి సమాధానం పంపారు. మొదట వచ్చిన రెండు అభ్యంతరాలకు సమాధానమిచ్చామని, ఇప్పుడు చెబుతున్న ‘అనేక అభ్యంతరాలు’ ఏమిటో చెబితే వాటికి కూడా సమాధానం ఇస్తామని కవిత కోరినట్లు తెలిసింది. తమకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పేరే కావాలని స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ పేరు విషయంపై వెనక్కితగ్గేది లేదని ఆమె తేల్చి చెప్పినటు కవిత సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దీనిపై న్యాయపోరాటం చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ పార్టీపై వచ్చిన ఫిర్యాదులు ఏంటో చెప్పకుండా పేరు మార్చుకోవాలని చెప్పడం సరికాదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈసీకి ఫిర్యాదులు వెళ్లటం వెనుక బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి.

Updated Date - Jul 05 , 2026 | 05:44 AM