‘టీఆర్‌ఎస్’ కవితదే!?
ABN , Publish Date - May 01 , 2026 | 05:19 AM
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించినట్టుగానే.. ఆమె పార్టీకి టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పేరుకు సంబంధించి కవిత ఐదు పేర్లను ప్రతిపాదించగా..
తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ప్రాథమిక అనుమతి
ప్రతిపాదించిన 5 పేర్లలో మూడో పేరుకు పచ్చ జెండా
స్వయంగా లేఖ అందజేసిన ఎన్నికల సంఘం ప్రతినిధి
పత్రికల్లో పార్టీ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు ఓకే
అభ్యంతరాలేమీ రాకపోతే ఇదే పేరు ఖరారయ్యే చాన్స్
టీఆర్‌ఎస్.. నాకు రాసి పెట్టి ఉందేమో?: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించినట్టుగానే.. ఆమె పార్టీకి టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పేరుకు సంబంధించి కవిత ఐదు పేర్లను ప్రతిపాదించగా.. తెలంగాణ రక్షణ సేన పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈసీఐ పంపిన లేఖను కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి గురువారం స్వయంగా అందజేశారు. తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలి హోదాలో కవిత తన కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సెక్షన్ 29ఏ (ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951) ప్రకారం తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుతో బహిరంగ నోటీసు (పబ్లిక్ నోటీస్) ఇచ్చేందుకు అనుమతించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీఐ పంపిన లేఖలో కొన్ని నిబంధనలను విధించింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేలా రెండు జాతీయ, రెండు స్థానిక పత్రికల్లో వరుసగా రెండు రోజులు ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. ఈ నోటీసు వెలువడిన 30 రోజుల్లోపు ఏవైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తామని, ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందని అధికారులు అందు లో పేర్కొన్నారు. ప్రకటనల క్లిప్పింగులతోపాటు పార్టీ నిబంధనావళి, ఇతర పత్రాలను నెలలోగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఐదు పేర్లను ప్రతిపాదించిన కవిత
రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమైన కవిత.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగం గా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రజా జాగృతి (టీపీజే), తెలంగాణ జాగృతి (టీజే), తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్), తెలంగాణ రాష్ట్ర జాగృతి (టీఆర్‌జే), తెలంగాణ ప్రజా శక్తి (టీపీఎస్).. పేర్లను ఈసీఐ పరిశీలనకు పంపారు. ఈ పేర్లలో ఏది ఖరారు చేసినా తమకు ఆమోదయోగ్యమేనని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. ఇందుకనుగుణంగానే తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీఐ ప్రాథమికంగా అనుమతించింది. కవిత ప్రకటించినట్టుగానే టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా ఉన్న పేరుకే ఈసీ అనుమతి రావడం విశేషం.
టీఆర్‌ఎస్ నాకే రాసి పెట్టి ఉందేమో?: కవిత
‘‘విధి విలాసం.. విచిత్రంగా ఉంటుంది. నా పార్టీకి ఐదు పేర్లను ఈసీఐకి ప్రతిపాదిస్తే.. అందులో మూడో ప్రాధాన్యతలో ఉన్న తెలంగాణ రక్షణ సేన పేరుకు ప్రాథమిక అనుమతి దక్కింది’’ అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాము పంపిన పేర్లలో టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామం ఉన్న ఏకైక పేరు అదొక్కటేనని, తన పార్టీకి ఆ పేరే రావడం ఆనందం కలిగిస్తోందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వ్యక్తిగతంగా అనుమతిపత్రాన్ని అందుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్.. నాకే రాసి పెట్టి ఉందేమో? అని గురువారం ‘ఎక్స్’ వేదికగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి ద్వారా రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ.. ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పని చేస్తానని తెలిపారు.