‘సర్’ తర్వాతా పేరు నమోదు చేసుకోవచ్చు
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:13 AM
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతోంది.
ఓటు హక్కు కోల్పోతామని ఆందోళన చెందక్కర్లేదు
‘సర్’లో పేరు నమోదు చేసుకోలేకపోతే తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు
బీఎల్‌వోకు లేదా ఆన్‌లైన్‌లో ఫారం-6 సమర్పించాలి
హైదరాబాద్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కూడా సర్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్ పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా ఓటు హక్కు కోల్పోతామా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసీఐ విధి విధానాల ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ. అయితే.. సర్ ద్వారా ప్రత్యేక ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని, దీన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఈసీఐ సూచిస్తోంది. ఏ కారణంతోనైనా సర్‌లో వివరాలు నమోదు చేసుకోకుంటే తర్వాత కూడా అవకాశం ఉంటుందని ఈసీఐ వర్గాలు చెబుతున్నాయి.
సర్‌లో పేరు లేకపోతే ఓటు హక్కుపోతుందా?
అలాంటిదేమీ ఉండదు. సర్‌లో నమోదు కాకపోయినా తర్వాత దరఖాస్తు చేసి ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవచ్చు. బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు దరఖాస్తు, పత్రాలను పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత దరఖాస్తుదారుడి పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికీ అవకాశం ఉంటుంది.
సర్ ముగిశాక ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సంబంధిత బీఎల్‌వోకు దరఖాస్తు అందజేయొచ్చు. లేదంటే ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో సమర్పించాలి. స్వయంగా వెళ్లలేకపోతే ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘం పోర్టల్/యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటరుగా నమోదు కావాలంటే ఫారం-6 సమర్పించాలి.
పత్రాలు సమర్పించాలి?
వయసు రుజువు కోసం పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి మెమో వంటివి సమర్పించాలి. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఇతర ఆధార పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.
మరో నియోజకవర్గంలో ఓటు ఉంటే ఏం చేయాలి?
కొత్త ప్రాంతంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయాలి. పరిశీలన తర్వాత పాత నియోజకవర్గంలోని ఓటు తొలగించి, కొత్త ప్రాంతంలో పేరు నమోదు చేస్తారు.
ఎన్నికలకు ముందు కూడా నమోదు చేసుకోవచ్చా?
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందు వరకు కొత్త ఓటర్లు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఆగకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేయడం మంచిది.
ప్రజలకు ఈసీఐ ప్రధాన సూచన ఏంటి?
సర్ సమయంలో పేరు నమోదు చేసుకోలేకపోయినా ఇబ్బందిలేదు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు నిరంతర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దరఖాస్తు చేసి తన ఓటు హక్కు పొందవచ్చు.