Share News

Early Mango Season Hits Markets: మామిడి పళ్లోయ్‌.. మామిడి పళ్లు!

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:52 AM

మామిడి పళ్ల ప్రియులకు వసంతం ముందే వచ్చింది. సాధారణంగా ఏప్రిల్‌ నుంచి కనిపించే మామిడి పళ్లు దాదాపు మూడు నెలల ముందుగానే మార్కెట్‌లో కనిపిస్తున్నాయి.

Early Mango Season Hits Markets: మామిడి పళ్లోయ్‌.. మామిడి పళ్లు!

  • మూడు నెలలు ముందుగానే మార్కెట్‌కు.. బంగినపల్లి రకం కిలో రూ.200 నుంచి రూ.300 దాకా

  • సాధారణంగా మామిడి పళ్ల సీజన్‌ మార్చి నుంచే

  • హైబ్రిడ్‌ సాగు వల్ల సంక్రాంతికే వచ్చేసిన పళ్లు

  • ధర ఎక్కువైనా రుచి అంతంతే.. ఆసక్తి చూపని జనం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మామిడి పళ్ల ప్రియులకు వసంతం ముందే వచ్చింది. సాధారణంగా ఏప్రిల్‌ నుంచి కనిపించే మామిడి పళ్లు దాదాపు మూడు నెలల ముందుగానే మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. జనం ఎక్కువగా ఇష్టపడే బంగినపల్లి, బెనిషాన్‌ వంటి రకాలు ఇప్పుడు ఎర్రగడ్డ, ఎంజే, మెహదీపట్నం, గడ్డి అన్నారం తదితర మార్కెట్‌లలో లభిస్తున్నాయి. కిలో ధర రూ.200పైనే! అయినా సీజన్‌లో తొలి మామిడి రుచి చూసేయాలంటూ వినియోగదారుల్లో కొందరు ఆసక్తి కనబరుస్తున్నా.. సీజన్‌ ప్రారంభానికి ముందే వచ్చిన ఈ మామిడి పెద్ద రుచిగా లేదని చాలామంది పెదవి విరుస్తున్నారు. వర్షాలు, వాతావరణ మార్పులు, రైతుల సాగు విధానాల వల్ల సీజన్‌కు మూడు నెలల ముందుగానే మార్కెట్‌లో మామిడి కనిపిస్తుండటంపై ఎర్రగడ్డ రైతు బజార్‌ సమీపంలో వ్యాపారం చేస్తున్న సలీం స్పందించాడు. ‘‘ఇప్పుడు పళ్లకు సీజన్‌ అంటూ ఏముంటుంది చెప్పండి? సీజనల్‌ ఫ్రూట్స్‌ అంటున్నామే కానీ, అన్ని సీజన్‌లలోనూ అన్ని పళ్లూ కనబడుతున్నాయి, మామిడి కూడా అంతే’’ అని వ్యాఖ్యానించాడు. మామిడి రుచిబాగా తెలిసిన వినియోగదారల్లో చాలామంది పళ్లు చప్పగా, పుల్లగా ఉంటాయాని తెలిసి కొనేందుకు ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు అంటున్నారు. సాఽధారణంగా వేసవిలో కిలో రూ. 50-60కు లభించే బంగినపల్లి రకం కూడా ఇప్పుడు రూ.200-300 శ్రేణిలో లభిస్తుండటంతో మామిడి అంటే విపరీతంగా ఇష్టపడే వారు కూడా కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. తాను గత పదేళ్లుగా పళ్లవ్యాపారం చేస్తున్నానని, గత మూడేళ్ల నుంచే మామిడి.. డిసెంబరు-జనవరిలోనే మార్కెట్‌కు రావడం కనిపిస్తోందని ఎర్రగడ్డకు చెందిన అస్లాం చెప్పాడు. చాలామంది హైబ్రిడ్‌ సాగు విధానాలను అనుసరిస్తున్నారని, దీనికి తోడు వాతావరణ మార్పులు, అకాల వర్షాలు కూడా మామిడి పంట సాగు విధానాల మార్పునకు కారణమవుతున్నాయంటున్నారు వ్యాపారులు.

Updated Date - Jan 20 , 2026 | 01:52 AM