Share News

Early Detection Key to Cervical Cancer: అవగాహనే చాలు.. అంతుచూడొచ్చు!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:09 AM

మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సరే ఎక్కువ. ఈ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తుండటంతో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Early Detection Key to Cervical Cancer: అవగాహనే చాలు.. అంతుచూడొచ్చు!

  • స్ర్కీనింగ్‌ టెస్ట్‌తో సర్వైకల్‌ క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చు

  • పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నాం కదా? అనే నిర్లక్ష్యం ఏమాత్రం తగదు

  • ప్రతి రెండేళ్లకోసారి తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలంటున్న వైద్యులు

  • ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సరే ఎక్కువ. ఈ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తుండటంతో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్యాన్సర్‌ నివారణకు మహిళలకు అవగాహనే ప్రధాన ఆయుధం అని, క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు 90శాతం ఉంటాయని అంటున్నారు. 30-35 ఏళ్లు దాటిన మహిళలు రెండేళ్లకోసారి ప్యాప్‌ (ప్యాపనికొలావ్‌) అనే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ టెస్టు ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని, అప్పుడు పూర్తిగా నివారించవచ్చునని చెబుతున్నారు. ఈ క్యాన్సర్‌ నిర్ధారణకు సెల్ఫ్‌-సాంప్లింగ్‌, హెచ్‌పీవీ-డీఎన్‌ఏ (హ్యూమన్‌ పాపిలోమావైరస్‌) టెస్ట్‌ కిట్లు కూడా అందుబాటులోకొచ్చాయి. సర్వైకల్‌ కేన్సర్‌ నిర్ధారణకు పాప్‌స్మియర్‌ అనే టెస్టు కూడా అందుబాటులో ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలు తీసుకుని పరీక్షిస్తారు. పెల్విక్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా కూడా సర్వైకల్‌ నార్మల్‌గా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చునని, సర్వైకల్‌ ప్రాంతం నుంచి ముక్క తీసి బయాప్సీ చేయడం ద్వారా కూడా ఈ రకం క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చునని వివరిస్తున్నారు. ఒకవేళ క్యాన్సర్‌ ఉన్నట్లయితే ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి అల్ర్టా సౌండ్‌ అబ్డామిన్‌, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేస్తారు. కాగా, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఏటా దాదాపు పది వేల నుంచి పన్నెండు వేల మంది క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందిస్తుండగా అందులో 13 శాతం రోగులు సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులేనని వైద్యులు వివరించారు. రోజూ వంద వరకు కొత్త క్యాన్సర్‌ కేసులు వస్తే అందులో 40 నుంచి 60 వరకు సర్వైకల్‌ క్యానర్లు ఉంటున్నాయి.


తొందరగా గుర్తిస్తే...

సర్జికల్‌ అంకాలజిస్టుగా రోగుల నుంచి తర చూ ఒకే రకమైన భయాలను వింటుంటాను. అదే.. క్యాన్సర్‌ వచ్చిందని తేలితే ఇక జీవితం ముగిసినట్లేనన్న భావన! ఇది వాస్తవం కాదు. ఈ క్యాన్సర్‌ను తొందరగా గుర్తిస్తే, కోలుకునే అవకాశం 90శాతం వరకు ఉంటుంది. కోలుకున్న మహిళల్లో చాలా మంది పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ముందే ఎందుకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి? అనే అపోహ చాలామందిలో ఉంది. నిజానికి, స్ర్కీనింగ్‌ అనేది ఆరోగ్యంగా ఉన్న మహిళల కోసమే. లక్షణాలు ఉన్నా లేకపోయినా, జీవనశైలి ఎలా ఉన్నా ప్రతి మహిళ తమకు ఆరోగ్య సమస్యలు వచ్చే వరకు వేచి చూడటం సరికాదు.

-డా. భవ్య బయానా రచన, అంకాలజిస్టు, కిమ్స్‌

ఎన్‌ఎ్‌ఫహెచ్‌ సర్వేలో

2019-2021లో నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం, మనదేశ మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టు చేయించుకునేవారు చాలా తక్కువమంది ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. 30 నుంచి 49 ఏళ్ల మధ్య మహిళల కోసం నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కేవలం 3.4 శాతం మందే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకున్నట్లు తేలింది. ఏపీలో 4.7 శాతం, తమిళనాడులో 10.1, కేరళలో 3.5, మహారాష్ట్రలో 2.5, పంజాబ్‌లో 2.6 శాతం మహిళలు పరీక్షలు చేయించుకున్నట్లు ఈ సర్వే ద్వారా తేలిందని వైద్యులు తెలిపారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ లక్షణాలు మొదట్లో స్వల్పంగానే ఉంటాయి. కొన్నిసార్లు కొద్దిపాటి లక్షణాలు కూడా బయటపడవు. అప్పుడు ఇన్‌ఫెక్షన్‌, మూత్రంలో దుర్వాసన తదితర అస్పష్టమైన లక్షణాలను గమనించవచ్చు. తరుచూ వెన్నునొప్పి ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అనేది హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా వస్తుంది.

Updated Date - Jan 20 , 2026 | 02:09 AM