పరీక్ష ముగిసిన వెంటనే స్ర్కీన్‌పై మార్కులు
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:05 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్-2026 దరఖాస్తు ప్రక్రియతోపాటు పరీక్షల నిర్వహణలో వినూత్న మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
గత రెండేళ్ల సరళి ఆధారంగా ర్యాంకుల జాబితా కూడా..
ఎప్‌సెట్-2026 దరఖాస్తు, పరీక్ష నిర్వహణలో మార్పులు
మొబైల్ ఫోన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం
దరఖాస్తులో తప్పులుంటే హెల్ప్‌లైన్ కేంద్రం నుంచి సమాచారం
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్-2026 దరఖాస్తు ప్రక్రియతోపాటు పరీక్షల నిర్వహణలో వినూత్న మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎప్‌సెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయనే దాని కోసం ఇకపై ఫలితాల ప్రకటన వరకు వేచి ఉండాల్సిన పని లేదు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే విద్యార్థుల కంప్యూటర్ స్ర్కీన్‌పై వారికి వచ్చే మార్కులు కనిపిస్తాయి. ప్రాథమిక కీ ఆధారంగా మార్కులు కనిపిస్తాయి. అంతేకాక, ఆ మార్కులకు ఎంత ర్యాంకు రావొచ్చు అనే విషయాన్ని కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎప్‌సెట్ వెబ్‌సైట్‌లో గత రెండేళ్ల ఫలితాల ఆధారంగా ర్యాంకుల అంచనా జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఇక, దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మొబైల్ ఫోన్‌లోనే విద్యార్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నూతన మార్పులకు సంబంధించిన వివరాలను ఎప్‌సెట్-2026 కన్వీనర్ విజయకుమార్ రెడ్డి.. జేఎన్‌టీయాలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎప్‌సెట్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ఎప్‌సెట్ అధికారులు ఈసారి మొబైల్ అడాప్టివ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌ల వంటి పరికరాల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఆన్‌లైన్ ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు, పేమెంట్ స్టేటస్. ఏదశలో ఉన్నాయో తెలుసుకునే వీలు కూడా ఈసారి కల్పించారు.
తప్పు దొర్లితే ఫోన్ చేసి మరీ చెబుతారు
ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివిన అభ్యర్థులు ఇంజనీరింగ్ పరీక్షకు, బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు ఎప్‌సెట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. అయితే, దరఖాస్తు పూర్తి చేసే సమయంలో ఎవరైనా విద్యార్థి ఎంపీసీకి బదులు బైపీసీ అని ఎంపిక చేసుకున్నా, బైపీసీకి బదులు ఎంపీసీ అని ఎంపిక చేసుకున్నా .. మీరు తప్పు చేశారంటూ వెంటనే ఎప్‌సెట్ నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ రానుంది. ఈ కొత్త విధానాన్ని కూడా ఎప్‌సెట్-2026లో అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా అభ్యర్థి ఏదైనా పొరపాటు చేస్తే ఎప్‌సెట్ హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి కాల్ చేసి సదరు అభ్యర్థిని అప్రమత్తం చేస్తారు. దీంతో దరఖాస్తు ప్రక్రియలో తప్పుల నివారణకు అవకాశం ఏర్పడనుంది. ఇక, ఎప్‌సెట్-2026 దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఏదేని కారణంతో సకాలంలో ఎప్‌సెట్ దరఖాస్తు చేయని వారికి, పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు రూ.10వేల జరిమానాతో ఈ ఏడాది నుంచి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎస్1, 2, 3 కేటగిరీ రిజర్వేషన్ విధానాన్ని ఈ ఏడాది నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పొందుపరుస్తున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే నెల 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు 9, 10, 11తేదీల్లో జరగనున్నాయి.