Share News

అక్కాచెల్లెళ్లను ఢీకొట్టిన కారు!

ABN , Publish Date - May 10 , 2026 | 05:56 AM

నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టింది. అక్క అక్కడిక్కడే మృతిచెందగా..

అక్కాచెల్లెళ్లను ఢీకొట్టిన కారు!

  • అక్క దుర్మరణం.. చెల్లెలికి తీవ్రగాయాలు

  • ఎప్‌సెట్‌ రాసి నడిచి వెళుతుండగా ఘటన

వనస్థలిపురం, మే 9(ఆంధ్ర జ్యోతి): నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టింది. అక్క అక్కడిక్కడే మృతిచెందగా.. చెల్లెలు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. వనస్థలిపురంలో శనివారం ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ చలకుర్తికి చెందిన మైనంపాటి వల్లపురెడ్డి బధిరుడు. సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు. అతడు.. భార్య ఇద్దరు కూతుర్లు అంజలి (19), పూజితలతో కలిసి మన్సురాబాద్‌ మల్లికార్జుననగర్‌ కాలనీలో ఉంటున్నాడు. రెండో కుమార్తె పూజితకు శనివారం ఎప్‌సెట్‌ పరీక్ష ఉండటతో అక్క పూజితతో కలిసి ఇబ్రహీంపట్నంలోని పరీక్ష కేంద్రానికి వెళ్లారు. పూజిత పరీక్ష రాసిన తర్వాత ఇద్దరూ మధ్యాహ్నం బస్సెక్కి, వనస్థలిపురం ప్రళ్లవి గార్డెన్‌ వద్ద దిగారు. అక్కడి నుంచి విజయవాడ హైవే సర్వీసు రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టి.. అదే వేగంతో అంజలి, పూజితలను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన పూజితను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారు డ్రైవర్‌ జవహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు అజాగ్రతగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Updated Date - May 10 , 2026 | 05:57 AM