ప్రశాంతంగా ఎప్‌సెట్
ABN , Publish Date - May 10 , 2026 | 05:53 AM
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొత్తం 125 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో (ఉదయం/మధ్యాహ్నం) పరీక్షలు జరగ్గా....
ఇంజనీరింగ్ పరీక్షకు తొలిరోజు 64,390 మంది హాజరు
కఠినంగా గణితం.. ఆధార్ లేని విద్యార్థులకు తప్పని అవస్థలు
హైదరాబాద్ సిటీ, మే9 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొత్తం 125 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో (ఉదయం/మధ్యాహ్నం) పరీక్షలు జరగ్గా, రిజిస్ట్రేషన్ చేసుకున్న 69,631మందికి గాను 64,930 మంది (93.24శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. 4,701 మంది గైర్హాజరయ్యారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జోన్‌లో 98.9శాతం, అత్యల్పంగా హైదరాబాద్-1, సత్తుపల్లి జోన్లలో 88శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వరంగల్ జోన్‌లో 96.4 శాతం, సిద్ధిపేటలో 98.7, సంగారెడ్డిలో 94.8, నల్గొండ 98.20, ఖమ్మం 96.20, కోదాడ 91, మహబూబ్‌నగర్ 94.7, అదిలాబాద్ జోన్‌లో 89శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
ఆధార్ లేదని అరగంట ఆపేశారు!
అభ్యర్థుల్లో కొందరు ఆధార్ కార్డు తెచ్చుకోకపోవడంతో సిబ్బంది పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అప్పటికప్పుడు వారు ఫోన్లు చేసి ఇంటి నుంచి ఆధార్ కార్డులు తెప్పించుకున్నారు. అప్పటివరకు అరగంట పైగా పరీక్షాకేంద్రం బయటే వేచి ఉండాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అయితే హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో, పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలు స్పష్టంగా ఉన్నా మరో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్న నిబంధనను పలువురు ఆక్షేపిస్తున్నారు.
చుక్కలు చూపిన లెక్కలు!
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు గణితం ప్రశ్నలు చుక్కలు చూపించాయి. నిన్నటి మొన్నటివరకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు తయారైన అభ్యర్థులు సైతం ఎప్‌సెట్ ప్రశ్నపత్రం చూసి కంగుతిన్నారు. ప్రశ్నలు జేఈఈ కంటే కఠినంగా ఉండడంతో సమయం సరిపోలేదని వాపోయారు. జేఈఈ మెయిన్స్‌లో 75 ప్రశ్నలు ఇస్తుండగా, ఎప్‌సెట్‌లో 160 ఇవ్వడం సమంజసంగా లేదంటున్నారు. వీటికి కేవలం 150 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయంలోనే జవాబు కనుక్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఫిజిక్స్ ప్రశ్నలు ఓ మోస్తరు కఠినంగా, కెమిస్ట్రీ ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు పలువురు చెప్పారు. దీనిపై శ్రీచైతన్య కళాశాల డీన్ తిరుమలేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఎప్‌సెట్‌లో కూడా ప్రశ్నలను 75కు కుదించాలని సూచించారు.
నిమిషం అలస్యమైందని..
కీసర: కీసరలోని అయాన్ డిజటల్ ఎప్‌సెట్ పరీక్ష కేంద్రం వద్ద ఒక నిమిషం అలస్యం కావడంతో ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. వారితో పాటు తల్లిదండ్రులు గేటు వద్ద సిబ్బందిని ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయిం ది. దాంతో ఆ ఇద్దరు విద్యార్థులు గేటు దూకి పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దాంతో ఆ విద్యార్థులు చేసేది లేక వెళ్లిపోయారు.