ఎప్‌సెట్ కౌన్సెలింగ్ స్లాట్ల పెంపు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:00 AM
ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్లు దొరక్క ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యామండలి ఊరటనిచ్చింది.
ప్రతి కేంద్రంలో రోజుకు 160 అదనపు స్లాట్లు
హైదరాబాద్ సిటీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్లు దొరక్క ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యామండలి ఊరటనిచ్చింది. అభ్యర్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ల సంఖ్యను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి హెల్ప్‌లైన్ కేంద్రంలో రోజుకు అదనంగా 160 అదనపు స్లాట్లు పెంచారు. జేఎన్‌టీయూ కేంద్రంలో ఇప్పటివరకు రోజుకు 640 స్లాట్లు ఉండగా, మంగళవారం నుంచి దానిని 800 స్లాట్లకు పెంచారు. ఎప్‌సెట్‌లో 1.44 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ప్రస్తుతం 1.20 లక్షల స్లాట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ అభ్యర్థుల నుంచి డిమాండ్ ఇంకా పెరిగితే, అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు మరిన్ని స్లాట్లను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఉండగా, హైదరాబాద్‌లో ఏడు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల నగరంలోని అభ్యర్థులకు స్లాట్లు దొరక్క జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.