లక్షన్నర మందిపై ఈగల్ ఏఐ నిఘా!
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:58 AM
నిషేధిత మత్తుపదార్థాలను ఉపయోగించే వారిపై ఇలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది...
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై నెలల క్రితమే ఈగల్‌కు సమాచారం
4 సార్లు మాటు వేసి.. వెనక్కి తగ్గి..
పక్కా సమాచారంతో తాజాగా..
ఈగల్ కనుసన్నల్లో మరి కొందరు?
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : నిషేధిత మత్తుపదార్థాలను ఉపయోగించే వారిపై ఇలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. మత్తు పదార్థాల వ్యాపారం చేసే వారు, సరఫరా చేసే వారు, వినియోగించే వారు.. ఇలా మూడు గ్రూపులకు సంబంధించి లక్షన్నర మంది ఉన్నట్లు ఈగల్ టీం వివరాలు సేకరించింది. వీరికి గోవా, బెంగళూరుతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. వీరు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలను సేకరించిన ఈగల్ బృందం.. వారిపై ఏఐ నిఘా కొనసాగిస్తోంది. పోలీస్ నిఘా నుంచి తప్పించుకునేందుకు వీరు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లతోపాటు కొన్ని సందర్భాల్లో ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించి.. ఇంటర్నెట్ ప్రొటోకాల్ కాల్ డేటా రికార్డు(ఐపీడీఆర్)ను నిత్యం పరిశీలిస్తోంది. ఈగల్ రాడార్‌లో ఉన్న వారు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరిపినా, నలుగురు కలిసి ఒకే ప్రాంతంలో ఉన్నా గుర్తించి ఈగల్ బృందాలు అలర్ట్ అవుతాయి. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిషేధిత డ్రగ్స్ వాడకం జరుగుతున్నట్లు ఈగల్ బృందానికి కొన్ని నెలల క్రితమే సమాచారం అందింది. క్షేత్ర స్థాయి నిఘా, సాంకేతిక ఆధారాలతో నాలుగు సార్లు మాటువేసినా... సరైన ఆధారాలు లభించే పరిస్థితి లేకపోవడంతో వెనక్కి తగ్గింది. శనివారం రాత్రి మరోసారి ఉప్పందడంతో ఈగల్ బృందం స్థానిక పోలీస్‌ల సహకారంతో రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని కొందరు రాజకీయ నాయకులకు డ్రగ్స్ వాడకంతో సంబంధాలు ఉన్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. అలాంటి వారందరి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.