Share News

దుండిగల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:03 AM

పురపాలక వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్న దుండిగల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌లో... యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ....

దుండిగల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?

  • కాలుష్యకారకంగా విద్యుదుత్పత్తిపై దక్షిణ డిస్కమ్‌ ఫిర్యాదు

  • పరిశీలనకు త్రిసభ్య కమిటీ నియామకం

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పురపాలక వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్న దుండిగల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌లో... యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఆర్‌సీ) స్పందించింది. అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేంటో నిగ్గు తేల్చాలని ఓ కమిటీని నియమించింది. అసలు విషయమేంటంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇంటింటి నుంచి సేకరించిన వ్యర్థాలను ప్రాసిసెంగ్‌ చేస్తే...రిఫ్యూజ్డ్‌ డిరైవ్డ్‌ ఫ్యూయల్‌ (ఆర్‌డీఎఫ్‌) తయారవుతుంది. ఈ ప్లాంట్‌లో ఈ ఆర్‌డీఎఫ్తోనే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను పాటించకుండా పురపాలక వ్యర్థాలను నేరుగా ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారని దక్షిణ డిస్కమ్‌(టీజీఎస్పీడీసీఎల్‌) ఈఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. దాంతో నిజాలను తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఈఆర్‌సీ కమిటీ వేసింది. ఇందులో సభ్యులుగా ఐఐటీ కాన్పూర్‌కు చెందిన డాక్టర్‌ అనూ్‌పసింగ్‌, కేంద్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖకు చెందిన శాస్త్రవేత్త-ఎఫ్‌ డాక్టర్‌ గౌరవ్‌ మిశ్రా, కేంద్ర విద్యుత్‌ అథారిటీ(సీఈఏ) డైరెక్టర్‌(టీఈ అండ్‌ టీడీ) రాజీవ్‌కుమార్‌ మిట్టల్‌ ఉన్నారు. ఈ కమిటీ ప్లాంట్‌ను పరిశీలించి, వారం రోజుల్లోగా నివేదిక అందించాలని ఈఆర్‌సీ నిర్దేశించింది. వాస్తవానికి చాలా రోజుల కిందటే ఈ ప్లాంట్‌ను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక వ్యర్థాలను ప్రాసిసెంగ్‌ చేయకుండా... ప్రమాదకరంగా, వాయుకాలుష్యం పెంచేలా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని గుర్తించింది. అయితే ఈ నిర్ణయం ముందుకెళ్లలేదు. తాజాగా కమిటీ వేయడంతో దాని నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - Jun 25 , 2026 | 05:03 AM