Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి దోస్తులు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:25 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి దోస్తులు

  • ఆ పార్టీల మధ్య ఒప్పందం

  • కాంగ్రె్‌సతోనే పట్టణాల సమగ్రాభివృద్ధి

  • కాంగ్రె్‌సను గెలిపించండి

  • చేవెళ్ల, తాండూర్‌,

  • వికారాబాద్‌లలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌/వికారాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు విమర్శించారు. ఆ రెండు పార్టీలు చీకటి దోస్తులని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తాండూర్‌, వికారాబాద్‌, చేవెళ్ల మునిసిపాలిటీల్లో శుక్రవారం ఆయన విస్రృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పరిగిలో శనివారం నిర్వహించనున్న ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల రూపు రేఖలను మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ‘రెడీ టు వర్క్‌ ఫోర్స్‌’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌ పై దృష్టి సారించి, యువతను అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దుతుంటే కొందరు ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. వికారాబాద్‌లో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మునిసిపల్‌ ఎన్నికల్లో వచ్చే నాలుగు రోజులు కీలకమని, 24 గంటలూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు.

Updated Date - Feb 07 , 2026 | 04:25 AM