Share News

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:02 AM

దుబాయిలో రద్దీగా ఉండే ఎమిరేట్స్‌ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు తెలంగాణ వాళ్లు ఉన్నారు.

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

  • మొత్తం ఏడుగురి దుర్మరణం.. పలువురికి గాయాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

దుబాయిలో రద్దీగా ఉండే ఎమిరేట్స్‌ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు తెలంగాణ వాళ్లు ఉన్నారు. గాయపడిన నలుగురిలో కూడా ఒకరు హైదరాబాద్‌ వ్యక్తి. ముగ్గురు మృతులు జగిత్యాల జిల్లాకు చెందినవారే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్‌ సలీం(51), మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన తిరుపతి గౌడ్‌(42), మెట్‌పల్లిలోని గాజులపేటకు చెందిన అబ్దుల్‌ రఫీఖ్‌(37) ఈ ప్రమాదంలో చనిపోయారు. గాయపడి చికిత్స పొందుతున్న హైదరాబాద్‌ కార్మికుడి పేరు మహమ్మద్‌ సయీద్‌. షార్జాలోని ఓ అల్యూమీనియం పరిశ్రమలో వీరందరూ పనిచేస్తున్నారని, కం పెనీ యజమాని కేరళకు చెందినవారని సమాచారం. కార్మికులంతా మినీ బస్సులో వెళ్తుండగా.. ఆ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి 8నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. అబ్దుల్‌ రఫీక్‌కు భార్య, కూతురు ఉన్నారు. రఫీక్‌ భార్య, కూతురు నిర్మల్‌ జిల్లా కడెంలో ఉంటుండగా, తల్లిదండ్రులు జగిత్యాల శివారులోని నూకపల్లిలో ఉంటున్నారు. సయ్యద్‌ సలీంకు భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సలీం భార్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

Updated Date - Jun 10 , 2026 | 05:02 AM