Share News

దుబాయిలోని ప్రవాసీ వ్యాపారవేత్త వితరణ

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:00 AM

దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రవాస భారతీయుడు, మలయాళీ వ్యాపారవేత్త డాక్టర్‌ షంషీర్‌ వయలీల్‌ ...

దుబాయిలోని ప్రవాసీ వ్యాపారవేత్త వితరణ

  • రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2.50కోట్ల సాయం

  • తెలంగాణలోని బాధిత కుటుంబాలతో సంప్రదింపులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రవాస భారతీయుడు, మలయాళీ వ్యాపారవేత్త డాక్టర్‌ షంషీర్‌ వయలీల్‌ అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు మొత్తం రూ.2.50కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్‌ బాట పట్టిన పేద ప్రవాసీ కుటుంబాలకు మానవత దృక్ఫథంతో సాయం చేయడం ఆత్మసంతృప్తి కలిగిస్తోందని డాక్టర్‌ షంషీర్‌ వయలీల్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ ప్రవాసులుసహా మొత్తం ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి రూ.26లక్షల చొప్పున మొత్తం రూ.1.80కోట్ల మేర ఆర్థిక సాయం అందించనున్నట్లు షంషీర్‌ ప్రకటించారు. అలాగే, గాయపడిన తొమ్మిది మందికి చికిత్స, తదుపరి ఖర్చుల నిమిత్తం రూ.47లక్షలను అందిస్తానని వెల్లడించారు. చికిత్స పొందుతున్నవారి కుటుంబ సభ్యులు దుబాయి రావడానికి రూ.18లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బాధిత కుటుంబాల పిల్లల చదువుల కోసం రూ.13లక్షలను విరాళంగా ప్రకటించారు. కాగా, కేరళకు చెందిన డాక్టర్‌ షంషీర్‌కు యూఏఈ, ఒమన్‌, సౌదీ దేశాల్లో ఆస్పత్రులు, వైద్య రంగంలో వ్యాపారాలున్నాయి.

Updated Date - Jun 11 , 2026 | 05:00 AM