దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల హవా!
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:04 AM
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులలో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ ప్రయాణికులు తమ అధిపత్యాన్ని చాటుకున్నారు.
నెలకు 10లక్షల మందికి పైగా ప్రయాణం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులలో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ ప్రయాణికులు తమ అధిపత్యాన్ని చాటుకున్నారు. దుబాయ్ విమానాశ్రయ వార్షిక నివేదిక ప్రకారం, ఈ ఎయిర్‌పోర్ట్ గుండా రాకపోకలు సాగిస్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో నిలిచారు. 2025 సంవత్సరంలో సుమారు 1.2కోట్ల మంది ప్రయాణికులు భారత్ నుంచి దుబాయ్ మీదుగా ప్రయాణించారని నివేదిక వెల్లడించింది. అంటే నెలకు సగటున 10లక్షల మంది భారతీయులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకుంటూ దుబాయ్ ఎయిర్‌పోర్టుకు అతిపెద్ద సోర్స్ మార్కెట్‌గా నిలిచారు. 2025లో దుబాయ్ విమానాశ్రయం మొత్తం 9.52కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలలోని 291 నగరాలకు 108 విమానయాన సంస్థలు దుబాయ్ నుంచి సేవలు అందిస్తుండగా.. అందులో ముంబై, న్యూఢిల్లీలు కీలక గమ్యస్థానాలుగా ఉన్నాయి. దుబాయి నుంచి ప్రతిరోజు హైద్రాబాద్‌కు ఆరు విమానాలు నడుస్తుండటం ఈ రద్దీకి నిదర్శనం.