భీమ్‌రెడ్డి అరెస్ట్!
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:27 AM
ఆదాయానికి మించిన ఆస్తుల(డీఏ) కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. భీమ్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారన్న....
రూ.300 కోట్ల అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన డీఎస్పీ డైరీ
ప్రస్తుత, మాజీ అధికారులతో లావాదేవీలు
రాజకీయ నాయకులతోనూ కలిసి డీల్స్
బినామీల్లో కీలకంగా ఓ హోంగార్డు
ఆస్తులు, బినామీల లెక్క తేల్చే పనిలో ఏసీబీ
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల(డీఏ) కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. భీమ్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారన్న సమాచారంతో నాలుగు రోజుల క్రితం ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆయన నివాసంతో పాటు బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు, ఆస్తుల విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సోదాల సమయంలో అస్వస్థతకు గురైన భీమ్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జి అయిన వెంటనే ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏసీబీ సోదాలు, అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక, భీమ్‌రెడ్డికి ఉన్న నెట్‌వర్క్ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి.
ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. బినామీలు, ఆస్తుల గుట్టు రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిడీఎస్పీ స్థాయికి చేరుకున్న భీమ్‌రెడ్డి సర్వీస్ మొత్తం కీలక స్థానాల్లోనే కొనసాగారు. పోలీస్ శాఖలో హోంగార్డులు మొదలు ఐపీఎస్ ఉన్నతాధికారుల వరకు కలిసి లావాదేవీలు నెరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ కొంత వివరాలు రాబట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బినామీ ఆస్తుల్లో ఎక్కువగా ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హోంగార్డు పేరు మీద ఉన్నట్లు తెలిసింది. సోదాల సమయంలో బయటపడ్డ నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలతోపాటు ఓ డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఆస్తులు, కుటుంబ సభ్యులకు పంపకాల వివరాలతో పాటు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో తాను నెరిపిన లావాదేవీలకు సంబంధించిన కొంత సమాచారం పొందుపర్చినట్లు తెలిసింది. డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు మొత్తం వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సీనియర్ అధికారుల్లో ప్రస్తుతం సర్వీ్‌సలో ఉన్నవారితోపాటు పదవీ విరమణ చేసిన ఒకరిద్దరు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీస్ శాఖలోనే కాకుండా కొందరు రాజకీయ నాయకులతో కలిసి భీమ్‌రెడ్డి ఎక్కువగా సివిల్ వ్యవహారాలు చక్కబెట్టారు. వారందరిపైనా ఏసీబీ దృష్టి సారించింది. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యా్‌పను సాంకేతికంగా పరిశీలించిన అనంతరం భీమ్‌రెడ్డితో అంటకాగిన ఖాకీ, ఖద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది.
కర్ణాటక భూముల పైనా నజర్
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమ ఆదాయంలో ఎక్కువ భాగం భూముల కొనుగోలుపైనే వెచ్చించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రధానంగా కర్ణాటకలో భూముల కొనుగోలు సమయంలో చెల్లింపులపై ఏసీబీ దృష్టి సారింది. కర్ణాటక భూములకు సంబంధించి నగదు చెల్లింపులు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది? వంటి అంశాలపై అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ఏసీబీ సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది. ఆదాయపు పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నింటి పైనా ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి.