Share News

Drunk Drivers Cause Chaos: నా బైక్‌ తాళాలు ఇస్తారా లేదా..

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:58 AM

నూతన సంవత్సర వేడుకలను నగర వాసులు ఘనంగా జరుపుకోవాలి.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా చూసుకోవాలి.. మద్యం తాగి వాహనాలు నడపొద్దు..

Drunk Drivers Cause Chaos: నా బైక్‌ తాళాలు ఇస్తారా లేదా..

  • నాంపల్లిలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన మద్యం ప్రియుడు

  • పోలీసుల కాళ్లు పట్టుకుని, తల గోడకు కొట్టుకుని హంగామా

  • ‘‘నన్నెందుకు కొట్టిండు’ అంటూ మరో మందుబాబు గొడవ

‘‘నూతన సంవత్సర వేడుకలను నగర వాసులు ఘనంగా జరుపుకోవాలి.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా చూసుకోవాలి.. మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. అవసరమైతే ఒక డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోండి. క్యాబ్‌ల్లో ఇంటికి వెళ్లండి.. కొత్త సంవత్సరం రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికి పోలీసు కేసులు, ప్రమాదాల భారినపడి ఆసుపత్రి బిల్లులను గిఫ్టుగా ఇంటికి తెచ్చుకోవద్దు..’’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వారం పది రోజుల నుంచి నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ.. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికితే జరిగే పరిణామాలపై హెచ్చరించారు. అయినా ఆ మాటలు మందుబాబుల చెవికెక్కలేదు. మారండి మారండి అని పోలీసులు ఎంత చెప్పినా మారలేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. వారిలో కొందరు రోడ్లపై నానా హంగామా చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, వాహనాలతో ఇంటికి వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశారు. తాగిన మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగి వారికి చుక్కలు చూపించారు. ఉదాహరణకు.. నాంపల్లి పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఒక యువకుడు.. ‘‘నా బైక్‌ ఇప్పించండి ఆరామ్‌సే (నిదానంగా) ఇంటికి వెళ్తాను’’ అంటూ పోలీసులను వేడుకున్నాడు. దీనికి పోలీసులు.. ‘‘బైక్‌ తర్వాత ఇస్తాం. ఇప్పుడు మాత్రం ఆరామ్‌సే ఇంటికి వెళ్లు’’ అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బైక్‌ తాళాలు ఇస్తారా లేదా అంటూ ఏడ్చి మొత్తుకున్నాడు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కాళ్లపై పడి నానా హంగామా చేశాడు. గోడకేసి తలబాదుకున్నాడు. పోలీసులు అతణ్ని రకరకాలుగా సముదాయించి ఎట్టకేలకు ఇంటికి పంపారు. ఇదే తరహాలో.. ఫలకనుమా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా ఓ ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగి బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. తన వాహనం ఇవ్వాలని ఏడుస్తూ ట్రాఫిక్‌ పోలీసులను వేడుకుంటూ.. సాష్టాంగ నమస్కారం పెట్టాడు. అయినా పోలీసులు అతడి వాహనం ఇవ్వకుండా సముదాయించి పంపించివేశారు.

  • రాచకొండ పరిధిలోని వనస్థలిపురంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తాను తాగి, వాహనం నడపకపోయినా పోలీసులు కొట్టారంటూ నడిరోడ్డుపై పడుకున్నాడు. ‘‘నన్నెందుకు కొట్టినవ్‌’’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి, చుక్కలు చూపించాడు. పోలీసులు అతనిపై వనస్థలిపురం పీఎ్‌సలో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

Updated Date - Jan 02 , 2026 | 04:58 AM