Share News

డ్రగ్స్‌ కేసు.. డాక్టర్‌ బాలాజీకి స్టేషన్‌ బెయిల్‌

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:55 AM

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కాల్పులు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరికొందరు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దొరికిన నిందితులను అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్‌ మూలాలు కనుగొనేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్‌ కేసు.. డాక్టర్‌ బాలాజీకి స్టేషన్‌ బెయిల్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/మొయినాబాద్‌)

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కాల్పులు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరికొందరు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దొరికిన నిందితులను అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్‌ మూలాలు కనుగొనేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డితో పాటు రితీశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ ఆధారంగా నిందితులతో సంబంధాలు ఉన్న హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్‌ బాలాజీని సిట్‌ అదుపులో తీసుకుని విచారించింది. ఇతని ద్వారా మరింత కీలక సమాచారం రాబట్టారు. రోహిత్‌రెడ్డితో పాటు బాబీలోనో పబ్‌ నిర్వాహకుడు అర్జున్‌రెడ్డి, బాలాజీ, ప్రియాంకరెడ్డిలు వీకెండ్‌ డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గోవా డ్రగ్స్‌ మాఫీయాతో పట్టుబడిన డాక్టర్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇతణ్ని విచారించిన పోలీసులు శుక్రవారం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే డ్రగ్స్‌ కేసులో సప్లయిర్లు అభిషేక్‌ సింగ్‌, రాకేశ్‌ వర్మ కోసం ఇంకా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే వీరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

కస్టడీ పొడిగింపుపై పిటిషన్‌ తిరస్కరణ

జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఫ్రధాన నిందితుల బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు ప్రధాన నిందితులను మరింత విచారించేందుకు కస్టడీ పొడిగించాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులకు వచ్చేనెల 8వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ పిటిషన్‌, కస్టడీ పొడిగింపుపై ఈనెల 30న కోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - Mar 28 , 2026 | 05:55 AM