డ్రగ్స్ విక్రయం దేశద్రోహమే!
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:39 AM
దేశం తీవ్రవాదం, మావోయిజం వంటి సవాళ్లను అధిగమించినప్పటికీ.. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం మరో అతిపెద్ద సమస్య మారిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
డీజీ నుంచి హోంగార్డు వరకు అప్రమత్తంగా ఉండాలి
విద్యాసంస్థల్లో డ్రగ్స్ నివారణకు త్వరలో జీవో
యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి: దేశం తీవ్రవాదం, మావోయిజం వంటి సవాళ్లను అధిగమించినప్పటికీ.. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం మరో అతిపెద్ద సమస్య మారిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యాసంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిస్కెట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ను చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారని, ఇది దేశద్రోహానికి సమానమని అన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీసు వ్యవస్థ మొత్తం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. డ్రగ్స్ కట్టడిలో ఈగల్ ఫోర్స్ కీలకంగా పనిచేస్తోందని డీజీపీ అభినందించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేేసందుకు యాజమాన్యాల బాధ్యతను పెంచేలా త్వరలోనే కొత్త జీవో తేబోతున్నట్టు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ భరాల మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చే పార్సిళ్ల ద్వారా డ్రగ్స్ రవాణా పెరుగుతోందని చెప్పారు. మత్తు ముఠాల కట్టడితోపాటు డ్రగ్స్ వినియోగంతో వచ్చే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎన్డీపీఎ్‌సపై ప్రత్యేక శిక్షణ
మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావిత పదార్థాల చట్టం (ఎన్డీపీఎస్) కింద నమోదయ్యే కేసుల దర్యాప్తులో పోలీసు అధికారుల నైపుణ్యాలు, చట్టపరమైన అవగాహన, దర్యాప్తు సామర్థ్యాలను మెరుగుపరచేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీలో 37వ బ్యాచ్ ‘ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు కోర్సు’ సోమవారం ప్రారంభమైంది. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో దర్యాప్తు నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ కోర్సులో మొత్తం 60 మంది అధికారులు పాల్గొంటున్నారు.