సికింద్రాబాద్ స్టేషన్‌లో డ్రోన్ల నిఘా
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:12 AM
దేశంలోని ప్రతిష్ఠాత్మక రైల్వేస్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భద్రతను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆర్పీఎఫ్ పోలీసులు నిర్ణయించారు.
అనుమతి కోసం కేంద్రానికి ఆర్పీఎఫ్ లేఖ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతిష్ఠాత్మక రైల్వేస్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భద్రతను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆర్పీఎఫ్ పోలీసులు నిర్ణయించారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల వరకు ఎక్కడేం జరిగినా వెంటనే పసిగట్టేలా ఇప్పటికే సోలార్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నిఘాను మరింత పెంచేందుకుగాను డ్రోన్ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పది రోజుల క్రితం లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. రైల్వేస్టేషన్ చుట్టుపక్కల రైల్వే ట్రాక్‌లు, రైల్వే లైన్లు, రైలు పట్టాల వద్ద దుండగులు, అనుమానితులు ఎవరైనా తిరిగితే.. వారి కదలికలను పసిగట్టి తగిన చర్యలు తీసుకునేలా ఈ డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మౌలాలి, బేగంపేట్, సీతాఫల్‌మండి పరిసరాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌లను ట్యాబ్, కంప్యూటర్‌లో వీక్షించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే వందేభారత్ వంటి ముఖ్యమైన రైళ్లు మౌలాలి వైపు వెళ్లే వరకు డ్రోన్ కెమెరా గాలిలో ఎగురుతుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే తొలుత రెండు మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. ఆయా ప్రదేశాల్లో వివరాలు సేకరించాక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు.