Share News

గండిపేట భూకుంభకోణంలో నిందితుడి డ్రైవర్‌ అదుపులోకి

ABN , Publish Date - May 31 , 2026 | 05:40 AM

గండిపేటలో ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో అమ్ముకొని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో పరారీలో నలుగురు నిందితుల్లో ఒకరైన రాధాకృష్ణకు సంబంధించిన ...

గండిపేట భూకుంభకోణంలో నిందితుడి డ్రైవర్‌ అదుపులోకి

  • నలుగురి కోసం రెండు రాష్ట్రాల్లో గాలింపు

హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): గండిపేటలో ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో అమ్ముకొని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో పరారీలో నలుగురు నిందితుల్లో ఒకరైన రాధాకృష్ణకు సంబంధించిన డ్రైవర్‌ ప్రవీణ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ జీవోల తయారీలో రాధాకృష్ణ వాడిన డిజిటల్‌ పరికరాలను, ఇతర వస్తువులను డ్రైవరే దాచిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కీలకపాత్ర పోషించి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. బ్యాంకు లావాదేవీల్లో ఆయన ఖాతా నుంచే ఎక్కువ మొత్తంలో డబ్బులు బదిలీ కావడంతోఆయనపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఐదుగురి పేరిట భూములు క్రమబద్ధీకరించినట్లు ఐదు నకిలీ జీవోలు సృష్టించగా అందులో నలుగురు గండిపేట గ్రామానికి చెందినవారు. నిమ్మల దశరథ్‌ సంతానం. అయిదో వ్యక్తి కామను నాగేశ్వర్‌రావు ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్టయిన వారిలో నిమ్మల సాయి కిరణ్‌ పేరు మీద భూమి లేకపోయినా ఈ కేసులో అతని పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కేసును ఒక వ్యవస్థీకృత భూకుంభకోణంగా పరిగణనలోకి తీసుకున్నారు. బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్‌, సునీల్‌, రాధాకృష్ణలు పరారీలో ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగుల సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. మాజీ ఉద్యోగులు, డాక్యుమెంట్‌ కన్సల్టెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ మధ్యవర్తుల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ముఠాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మరిన్ని ముఠాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అదనపు కలెక్టర్‌ నంటూ బడాయి

ఈ కేసులో రాధాకృష్ణ ప్రధాన సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌నని చెప్పుకునే వాడు. భూమి కొనుగోలుదారులతో పరిచయం పెంచుకున్న రాధాకృష్ణ ఎకరా రూ.3 కోట్లకు డీల్‌ కుదిర్చాడు. ప్రభుత్వ జీఓ జారీ చేయించి, మ్యూటేషన్‌, భూమి బదలాయింపు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. అంతర్జాలంలో వెతికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీఓలు ఎలా ఉన్నాయి? వాటిలో వాడే ఫాంట్‌ రూపం, సైజ్‌ వాడే పదాలు ఎలా ఉన్నాయి? అధ్యయనం చేశాడు. అక్షర దోషాలు లేకుండా ఐదు నకిలీ జీఓలను సృష్టించాడు. ఈ జీఓల సాయంతో గండిపేటలో ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్రపన్నాడు.

Updated Date - May 31 , 2026 | 05:40 AM