Share News

నగరంలో తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:24 AM

లోయర్‌ మానేరు డ్యామ్‌కు అతిచేరువలోని అనేక కాలనీల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సరిగా వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్‌లో తాగునీటిని అందిస్తున్న లోయర్‌ మానేరు డ్యామ్‌లో నీటి నిలువలు గణనీయంగా తగ్గిపోయాయి. 24.034 టీఎంసీల సామర్థ్యం

నగరంలో తాగునీటి కష్టాలు

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): లోయర్‌ మానేరు డ్యామ్‌కు అతిచేరువలోని అనేక కాలనీల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సరిగా వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్‌లో తాగునీటిని అందిస్తున్న లోయర్‌ మానేరు డ్యామ్‌లో నీటి నిలువలు గణనీయంగా తగ్గిపోయాయి. 24.034 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు డ్యామ్‌లో ఇటీవలి వరకు డెడ్‌ స్టోరేజీకి చేరువలో 5.5 టీఎంసీలకు పడిపోయింది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం 5.68 టీఎంసీల నీరు ఉంది.

ఫ బోరు బావులను ఫ్లష్‌ చేయిస్తున్నా..

లోయర్‌ మానేరు డ్యామ్‌కు సమీపంలోని కట్టరాంపూర్‌, కోతిరాంపూర్‌, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌, లక్ష్మినగర్‌, రాఘవేంద్రనగర్‌తోపాటు అనేక కాలనీల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల్లో నుంచి చుక్క నీరు రావడం లేదని కొందరు, కొద్దిసేపు మాత్రమే నీరు వస్తున్నాయని మరికొందరు వాపోతున్నారు. బోరుబావులను ఫ్లష్‌ చేయించడం, మరమ్మతులు చేయిస్తున్నా కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ నీటిపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. లోయర్‌ మానేరు డ్యామ్‌లో నీటి నిలువలు డెడ్‌ స్టోరేజీకి చేరినందున మిడ్‌ మానేరు నుంచి కనీసం రెండు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. డ్యామ్‌లో కనీస నీటి నిలువలు 8 నుంచి 10 టీఎంసీలు ఉంటేనే ఎల్‌ఎండీ సమీప కాలనీలోని బోరుబావుల్లోకి నీరు వచ్చే అవకాశాలుంటాయని, ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొన్నటి వరకు మిడ్‌ మానేరులో కూడా నీటి నిలువలు పూర్తిగా తగ్గిపోగా, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తుండడంతో ప్రస్తుతం 27.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన మిడ్‌ మానేరులో నీటి నిలువలు 16.346 టీఎంసీలకు చేరుకున్నాయి. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు మిడ్‌మానేరు రేడియల్‌ గేట్ల నుండి గురువారం ఉదయం 9 గంటలకు ఎల్‌ఎండి రిజర్వాయర్‌కు తాగునీటి అవసరాల కోసం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం కాదని, కనీసం రెండు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

2 టిఎంపిఆర్‌ 5ః

-----------------------------------------------------------------------

3,4 టిఎంపిఆర్‌ 5ఃఎల్‌ఎండిలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు

---------------------------------------------------------

నేడు ఎల్‌ఎండీకి నీటి విడుదల

తిమ్మాపూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ (ఎంఎంఆర్‌) రేడియల్‌ గేట్ల నుంచి గురువారం ఉదయం 9గంటలకు దిగువ మానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నాట్లు ఇరిగేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటి అవసరాల కోసం రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిడ్‌మానేరులోకి వచ్చే ఇన్‌ఫ్లో ఆఽధారంగా నీటి విడుదల పెంచే అవకాశం ఉంంది. నీటి విడుదల సందర్బంగా దిగువ గ్రామాలకు సంబందించి నదిలో ఉన్న మోటార్లను వీలైనంత త్వరగా తొలగించాలని, పశువులను నది వద్దకు రాకుండా చూడాలని అధికారులు సూచించారు.

ఫ ఎల్‌ఎండిలో ప్రస్తుత నీటి నిల్వలు

ఎల్‌ఎండి పూర్తి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రం 6 గంటలకు 5.706 టిఎంసిల నీరు ఎల్‌ఎండిలో నిల్వ ఉంది. కాలువల ద్వారా 625 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మిషన్‌ భగీరథ, ఆవిరి రూపంలో 208 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఎల్‌ఎండీలో 6.586 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

Updated Date - Aug 06 , 2026 | 12:24 AM