ఐఐటీహెచ్‌కు మార్గదర్శిగా సతీశ్‌రెడ్డి
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:20 AM
దేశాన్ని అంతరిక్ష యుద్ధ శక్తుల సరసన నిలిపిన రక్షణశాస్త్ర దిగ్గజం డా.సతీశ్‌రెడ్డి ఇప్పుడు విద్యారంగానికి సేవలు అందించనున్నారు.
మూడు సంవత్సరాల పాటు గౌరవ సలహాదారు
కంది, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : దేశాన్ని అంతరిక్ష యుద్ధ శక్తుల సరసన నిలిపిన రక్షణశాస్త్ర దిగ్గజం డా.సతీశ్‌రెడ్డి ఇప్పుడు విద్యారంగానికి సేవలు అందించనున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌కు మూడు సంవత్సరాలపాటు గౌరవ సలహాదారుగా ఆయన్ను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. డా.సతీశ్‌రెడ్డి తన కెరీర్‌లో పలు కీలక పదవులు అలంకరించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్(డీఆర్‌డీవో) చైర్మన్‌గా, రక్షణశాఖ ఆర్‌అండ్‌డీ కార్యదర్శిగా, ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్నారు. దేశ రక్షణ సామర్థ్యాలను పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాటిలైట్ వ్యతిరేక క్షిపణి పరీక్ష విజయవంతంగా జరిపి హైపర్‌సోనిక్ మిస్సైల్ టెక్నాలజీలో దేశాన్ని ముందుకు నడిపించిన గొప్ప శాస్త్రవేత్తగా గౌరవం దక్కించుకున్న సతీశ్‌రెడ్డి ఐఐటీహెచ్‌కు మార్గదర్శకులు కావడం గర్వకారణమని ఐఐటీహెచ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆయన సలహాలతో డిఫెన్స్ టెక్నాలజీలో విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, హైపర్‌సోనిక్ మిస్సైళ్ల తయారీలో పని చేసిన శాస్త్రవేత్త ఐఐటీహెచ్‌లో యువ ఇంజనీర్లకు నేరుగా మార్గనిర్ధేశం చేయనుండడం ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన బాసటగా నిలుస్తుందని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.