నిమ్స్ డైరెక్టర్‌గా రాహుల్ దేవ్‌రాజ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:17 AM
హైదరాబాద్‌లోని నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్‌గా సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
యూరాలజీ విభాగంలో విశేష అనుభవం కలిగిన వైద్యుడు
నిమ్స్‌లో కిడ్నీ మార్పిడి, రోబోటిక్ సర్జరీల్లో కీలక పాత్ర
హైదరాబాద్ సిటీ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్‌గా సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్‌ను మూడేళ్ల కాలానికి నిమ్స్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిమ్స్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప నుంచి ఆదివారం ఆయన డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో నిమ్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డాక్టర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. నిమ్స్‌లో రోగులకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. నూతన డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ నాయకత్వంలో నిమ్స్ మరిన్ని విజయాలు సాధిస్తుందని నగరి బీరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గాంధీ మెడికల్ కాలేజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ 1992 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ 1998లో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశారు. 2002లో యూరాలజీ ఎం.సీహెచ్ పూర్తి చేశారు. నిమ్స్ యూరాలజీ విభాగంలో పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నిమ్స్ యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. నిమ్స్‌లో నిర్వహిస్తోన్న కిడ్నీ మార్పిడి, రోబోటిక్ శస్త్రచికిత్స విధానాల అమలుకు ఆయన విశేష కృషి చేశారు.
నిమ్స్‌లో రెండు వేలకుపైగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో డాక్టర్ రాహుల్ కృషి ఎనలేనిది. గత మూడేళ్లలో 500 మూత్రపిండాల మార్పిడిలు చేశారు. 550 రోబోటిక్ వైద్య ప్రక్రియలను పూర్తి చేశారు. బోధనలో ఆయనకు 21 ఏళ్ల అనుభవముంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2016లో ఉత్తమ జూనియర్ ఫ్యాకల్టీ, 2022లో ఉత్తమ సీనియర్ ఫ్యాకల్టీ అవార్డులు కూడా అందుకున్నారు. కాగా, రాహుల్ దేవ్‌రాజ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, పరిపాలన విభాగం హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణరెడ్డి, డాక్టర్ అమరేశ్వర్, డాక్టర్ రామ్మూర్తి పాల్గొన్నారు.