కొన్ని రకాల క్యాన్సర్ల అంతమే లక్ష్యం
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:22 AM
కొన్ని క్యాన్సర్లను రాకుండా నివారించవచ్చని, వాటిని రాబోయే ఆరేడేళ్లలో పూర్తిగా తుడిచివేయాలనేదే నా లక్ష్యం. సరైన అవగాహన కల్పిస్తే కొన్ని క్యాన్సర్లను పెరగకుండా ఆపవచ్చు...
ఆరేడేళ్లలో వాటిని పూర్తిగా తుడిచివేయాలి.. వ్యాక్సిన్లతో సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు
మరికొన్నింటిని పూర్తిగా నయం చేయవచ్చు
తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌పై పోరాటానికి నా ప్రతిపాదనలను అంగీకరించిన సీఎంలు
ఆ రోడ్ మ్యాప్ అమలు బాధ్యత నాపై ఉంది
ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు
పద్మభూషణ్ రావడం సంతృప్తి కలిగించింది
క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సన్మానం
హైదరాబాద్ సిటీ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘కొన్ని క్యాన్సర్లను రాకుండా నివారించవచ్చని, వాటిని రాబోయే ఆరేడేళ్లలో పూర్తిగా తుడిచివేయాలనేదే నా లక్ష్యం. సరైన అవగాహన కల్పిస్తే కొన్ని క్యాన్సర్లను పెరగకుండా ఆపవచ్చు. ఈ దిశగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తాన’ని ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. క్యాన్సర్‌కు భయపడాల్సి అవసరం లేదని, చాలా క్యాన్సర్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేవడం, సులభతరం చేయడం తన లక్ష్యమని చెప్పారు. అమెరికాకు వెళ్లి దాదాపు యాభై ఏళ్లయినా ప్రతి మూడు నెలలకోసారి ఇక్కడకు వచ్చి రోగులను చూస్తున్నానన్నారు. ‘క్యాన్సర్ మహమ్మారిపై పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న నా దృఢ సంకల్పానికి ఇది సవాల్ లాంటిది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతిపాదనలు, రోడ్ మ్యాప్‌ను అంగీకరించారని, దానిని అమలు చేసే బాధ్యత తనపై ఉందన్నారు. తాను సైకిల్ తొక్కి, రిక్షాల్లో తిరిగిన తెలుగు నేలపై సేవ చేయడానికి అవకాశమిచ్చిన రెండు రాష్ట్రాల సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజలకు సేవ చేయడానికి సలహాదారునిగా నియమించారని, మన వాళ్లకు ఎంత చేయాలో అంత చేస్తానన్నారు.
వ్యాక్సిన్లతో క్యాన్సర్లకు చెక్
‘సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యానర్లను వ్యాక్సిన్లతో పూర్తిగా తగ్గించవచ్చు. కాలేయ క్యాన్సర్, హెపటైటిస్-బీకి మంచి వ్యాక్సిన్లు ఉన్నాయి. గొంతు, మెడ, తల, నోటి క్యాన్సర్లను త్వరగా గుర్తిస్తే వెంటనే తగ్గించడానికి అస్కారముంది. హైరిస్కు క్యాన్సర్లను ముందే గుర్తిస్తే చెక్ పెట్టవచ్చ’ని చెప్పారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ కేంద్రాలను విస్తరించాలన్నారు. క్యాన్సర్‌కు అనేక ఆధునిక చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడు, నాలుగు దశల్లో ఉన్న క్యాన్సర్‌ను కూడా నియంత్రణలో పెట్టవచ్చన్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవ రెడ్డి అప్పట్లో అమెరికాకు వస్తే చికిత్స చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్ తగ్గించానని, తర్వాత ఆయన 19 ఏళ్లు మంచి జీవితం గడిపారని తెలిపారు.
సంతృప్తిగా ఉంది
‘భారత ప్రభుత్వం నాకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ నా దేశం, నా ప్రజలు, నా ప్రభుత్వం... నేను చేసిన సేవలు, ఆవిష్కరణలు, పరిశోధనలకు గుర్తుగా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తి కలిగించింది. ఈ అవార్డు నా ఒక్కడి సొంతం కాదు. నేను చదువుకున్న తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు, ఉస్మానియా మెడికల్ కాలేజీది కూడా’ అని దత్తాత్రేయుడు చెప్పారు. తాను పేద కుటుంబం నుంచే వచ్చానని, కాలేజీకి సైకిల్ మీద వెళ్లానన్నారు.
కృత్రిమ స్వరపేటికతో జనగణమన
బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి-రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్టు చైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పతాకా విష్కరణ చేశారు. ఆస్పత్రికి చెందిన హెడ్ నెక్ విభాగం వైద్యుల ద్వారా చికిత్స పొందిన 75 మంది కృత్రిమ స్వరపేటికతో జాతీయ గీతాన్ని ఆలపించారు. దీన్ని లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రపంచ రికార్డుగా గుర్తించినట్లు ప్రకటించారు. జాతీయ గీతాలాపనలో పాల్గొన్న వారిని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, బాలకృష్ణ పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు.