Share News

ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:01 AM

ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు, ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ముళ్లపూడి వెంకటరత్నం (89) ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ ఆస్పత్రిలో చికిత్స పొందు.......

ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత

  • అయిదు దశాబ్దాల వైద్య వృత్తిలో 35 వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలు

  • నిమ్స్‌లో కొన్నాళ్లు ఉచితంగా సేవలు

  • చిన్నకుమార్తె స్మారకంగా ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు, ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ముళ్లపూడి వెంకటరత్నం (89) ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ సోమవారం ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. వెంకటరత్నం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో 1937 జూలై 1న జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన.. స్వగ్రామంలో టైఫాయిడ్‌ జ్వరాలతో ఎక్కువమంది చనిపోవడం చూసి చలించి వైద్యుడు అవ్వాలనుకున్నారు. కష్టపడి చదివి మెడికల్‌ సీటు సాధించారు. ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. అనంతరం అమెరికాకు వెళ్లిన ఆయన డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ కార్డియాలజీతో పాటు ఎఫ్‌ఏసీఎస్‌, ఎఫ్‌ఆర్‌సీఎస్‌ (సీ) పట్టాలు అందుకున్నారు. అమెరికాలో గుండె శస్త్రచికిత్స నిపుణుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎన్టీఆర్‌ ఆహ్వానంతో స్వదేశానికి వచ్చారు. పంజాగుట్ట నిమ్స్‌లో కార్డియాక్‌ సర్జన్‌గా 1995 నుంచి 97 వరకు ఉచితంగా పనిచేశారు. తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు.

చిన్నకుమార్తె స్మారకంగా...

ముళ్లపూడి వెంకటరత్నం భార్య నళిని ఎనస్తీషియనిస్ట్‌. వీరికి ఇద్దరమ్మాయిలు. పెద్ద కుమార్తె జ్యోతి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నకుమార్తె ఉష తన 19వ ఏట అమెరికాలో రైలు ప్రమాదంలో చనిపోయారు. సమాజానికి తనవంతు సేవ చేయాలన్న ఆమె ఆశయం మేరకు స్వదేశానికి వచ్చిన వెంకటరత్నం ఆమె స్మారకంగా హైదరాబాద్‌లో 2000 జనవరిలో ఉషా ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ నెలకొల్పారు. ఆయన యాభై ఏళ్ల వృత్తి జీవితంలో 35 వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలు చేశారని వారి ఆస్పత్రి ప్రతినిధులు చెప్పారు.

వైద్య వృత్తికే అంకితం..

ప్రతి ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉచిత వైద్య సేవలకు కేటాయిస్తామని గతంలో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో డాక్టర్‌ వెంకటరత్నం వెల్లడించారు. గతితప్పిన గుండె లయను సరిచేయడం మినహా మరో వ్యాపకం లేని ఆయన చివరి శ్వాస వరకు వైద్య సేవలకే అంకితమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో వెంకటరత్నం అంత్యక్రియలు నిర్వహించినట్లు ఉషా ముళ్లపూడి ట్రస్టీల్లో ఒకరైన అర్జున్‌ కోడూరి తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 05:01 AM