Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించాయి

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:12 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రాష్ర్టాన్ని దివాలా తీయించాయని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించాయి

  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రాష్ర్టాన్ని దివాలా తీయించాయని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. రెండు పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నాయన్నారు. శంకర్‌పల్లిలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బూటకపు, 420 హామీలతో ప్రజలను తప్పుదోవపట్టించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, రంగులు మార్చే ఊసరవెల్లి కూడా రే వంత్‌ను చూసి సిగ్గుతో తలదించుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ బాగుపడాలంటే మోదీ రావాలి, బీజేపీ కావాలని ప్రజలు అంటున్నారని లక్ష్మణ్‌ చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ నేతలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అసదుద్దీన్‌ ఓవైసీ మెప్పుకోసం టోపీ పెట్టుకున్నా, షెర్వానీ వేసుకున్నా పర్వాలేదు కానీ ప్రజల నెత్తిన టోపీ పెడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌ ఆలీ, రేవంత్‌ఖాన్‌గా మారిపోయారని చెప్పారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి తదితరులు, వార్డు అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:12 AM