హైదరాబాద్-రామగుండం గ్రీన్ ఫీల్డ్ హైవేకు డీపీఆర్ సిద్ధం
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:33 AM
రెండున్నరేళ్లలో రూ. 30 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, హైదరాబాద్-రామగుండం గ్రీన్ ఫీల్డ్ హైవేకు డీపీఆర్ సిద్ధమయ్యిందని, మూడు, నాలుగు రోజుల్లో మంజూరు కానున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో.. ప్రజల రాకపోకలకు రహదారులు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో సుమారు
పెద్దపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్లలో రూ. 30 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, హైదరాబాద్-రామగుండం గ్రీన్ ఫీల్డ్ హైవేకు డీపీఆర్ సిద్ధమయ్యిందని, మూడు, నాలుగు రోజుల్లో మంజూరు కానున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో.. ప్రజల రాకపోకలకు రహదారులు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన రోడ్డు పనులు, గోదాముల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్, మంథనిలో జరిగిన బహిరంగ సభల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రహదారిపై క్షేమంగా ప్రయాణించేలా పట్టణాలతో పాటు పల్లెలు, తండాల్లోనూ పెద్ద ఎత్తున బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ. 13,600 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 17 వేల కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన రోడ్ల పనులకు సంబంధించిన రూ. 40 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. 40 శాతం ప్రభుత్వం, 60 శాతం కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో చేపడుతున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) రోడ్లను రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, శ్రీశైలం, భాక్రానంగల్ వంటి ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉన్నాయని, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కట్టడం, కూలడం రెండూ జరిగాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా మల్లన్నసాగర్, ఫామ్‌హౌస్‌లకు నీటిని తరలించారని విమర్శించారు. మంథని ప్రాంతంలో చేపట్టిన చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేకు డీపీఆర్ సిద్ధమైందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పించామని, మూడు, నాలుగు నెలల్లో మంజూరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా సుల్తానాబాద్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఫ శ్రీపాద ఎల్లంపల్లి నీటితో రికార్డు స్థాయిలో పంటలు: శ్రీధర్‌బాబు
గడిచిన రెండేళ్లలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందించడం వల్లనే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు ఇవ్వకుండానే ఇవాళ బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లాలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో రూ.900 కోట్ల విలువైన రోడ్లు మంజూరు చేస్తే, తమ రెండున్నరేళ్ల పాలనలో రూ. 1700 కోట్ల విలువైన రోడ్డు పనులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి గత ఏడాది 3,500 ఇళ్లు, ఈ ఏడాది 2 వేల ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పినప్పుడు గతంలో నవ్వుకున్నారని, ఇప్పుడు వారిని కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఫ వాళ్లు కొబ్బరికాయలు కొడితే.. మేం గుమ్మడికాయలు కడుతున్నాం: మంత్రి తుమ్మల
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొబ్బరికాయలు కొట్టి వదిలేసిన పనులను పూర్తి చేసి తాము గుమ్మడికాయలు కడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వారు వదిలేసిన ఆస్పత్రులు, రోడ్లు, కూలిపోయిన ప్రాజెక్టులు, ఛిద్రమైన వ్యవస్థలను సరిచేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఇద్దరూ కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని పనులు చేపట్టి వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు. కేంద్రం సహకరించకపోయినా కృష్ణా, గోదావరి జలాల కోసం పోరాడుతున్నామని తెలిపారు. రోడ్ల విషయంలో మంత్రి వెంకట్‌రెడ్డి జేబులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారంటూ చమత్కరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే వంట గ్యాస్, సన్నబియ్యం అందిస్తున్నామని తుమ్మల తెలిపారు. ఇప్పటివరకు రూ. 1.36 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మంత్రులు సైతం వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారని తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
ఫ సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి
- ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయమరమణారావు
నియోజకవర్గంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రూ. 300 కోట్ల వరకు మంజూరు చేశారని అన్నారు. ఇవేగాకుండా నియోజకవర్గంలో అనేక పనులు నడుస్తున్నాయని, సుల్తానాబాద్‌కు బైపాస్‌రోడ్డుతో పాటు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌ను పునర్నిర్మించాలని, మరో 60 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణాలకు, 5 వేల టన్నుల కోల్డ్ స్టోరేజీ గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులు వెంకట్ రెడ్డి, నాగేశ్వర్ రావులను కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, ఒడ్నాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.