Share News

kumaram bheem asifabad- సందిగ్ధావస్థ

ABN , Publish Date - May 17 , 2026 | 10:18 PM

ఒకవైపు ఎండలు....మరోవైపు జనగణన..దీంతో పాటు బడిబాట కార్యక్రమం...ఏది నిర్వహించాలో అర్థంకాక ఉపాధ్యాయ వర్గాల్లో సందిగ్ధావస్థ నెలకొంది. ప్రభుత్వం నిర్వహించనున్న బడి బాట కార్యక్రమం ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారుతోందనే అభిప్రాయాలను ఉపాధ్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

kumaram bheem asifabad- సందిగ్ధావస్థ
బెజ్జూరులో బడిబాట ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు(ఫైల్‌)

- బడిబాట లక్ష్యం నెరవేరడంపై అనుమానం

బెజ్జూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఎండలు....మరోవైపు జనగణన..దీంతో పాటు బడిబాట కార్యక్రమం...ఏది నిర్వహించాలో అర్థంకాక ఉపాధ్యాయ వర్గాల్లో సందిగ్ధావస్థ నెలకొంది. ప్రభుత్వం నిర్వహించనున్న బడి బాట కార్యక్రమం ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారుతోందనే అభిప్రాయాలను ఉపాధ్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాలల ప్రారంభానికికంటే రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రారంభించి జూన్‌ 15వరకు కొనుసాగించేది. ఈ ఏడాది మాత్రం విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి ప్రారంభించి విడతల వారీగా జూన్‌ 19వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇదిలా ఉండగా 98శాతం మంది ఉపాధ్యాయులు జనగణన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. దీనికితోడు ఎండల తీవ్రత అధికంగా ఉంటుండటంతో బడిబాట కొనసాగేదెలా అని ఉపాధ్యాయులు తర్జనభర్జన పడుతున్నారు.

- జిల్లాలో షెడ్యూల్‌ ఇలా..

విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి బడిబాట ప్రారంభమైంది. ఈ కార్యక్ర మం జూన్‌ 19దాకా కొనసాగేలా విద్యాశాఖ షెడ్యూల్‌ ఖరారు చేసింది. కానీ వరుసగా కాకుండా 14న ప్రారంభ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో సమావేశం ఏర్పా టు చేయాలి. ఆ తర్వాత మళ్లీ 21నాడు అంగ న్‌వాడీ టీచర్ల, మథర్స్‌ కమిటి సమావేశం ఏర్పాటు చేయాలి. 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జూన్‌ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న ప్రత్యేక అవసరా లు గల పిల్లలను గుర్తించుట, 6న బడి బయట పిల్లలను గుర్తించనున్నారు. 8నుంచి 10వరకు ఇంటింటి ప్రచారం, 12న వెల్‌కమ్‌డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎ న్‌డే, 17న గర్ల్‌ చైల్డ్‌, ఇన్‌క్లూసీవ్‌ ఎడ్యుకేషన్‌ డే, 18న డిజిటల్‌ అవేర్‌నెస్‌ డే, 19న స్పోర్ట్స్‌ డే కార్యక్రమంతో బడిబాట ముగియనుంది.

- నెల పాటు జనగణనలో..

జనగణన విధుల్లో ఉపాధ్యాయులు ఉన్నా రు. ఈ విధులు ఉపాధ్యాయులు నెల రోజుల పాటు నిర్వర్తించనున్నారు. ఈ క్రమంలోనే బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. సెన్సెస్‌లో పాల్గొంటున్న ఉపాధ్యా యులకు ఆ విధులే సవాల్‌గా మారాయి. ఇదే సమయంలో బడిబాటలో ఎలా పాల్గొం టామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో 98శాతం మంది జనగణన విధుల్లో పాల్గొంటుండగా, మిగిలిన 2శాతం మంది ఉపాధ్యాయులను అధనంగా అదే విధులకు కేటాయించారు. ఇటు జనగణనలో, అటు బడిబాటలో ఏకకాలంలో ఎలా పాల్గొ నాలో అర్థంకాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండటంతో రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం కత్తిమీద సాము లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఉపాధ్యాయులు లేకుండా బడిబాట కార్యక్రమం కొనసాగడమెలా అని ప్రధానోపా ధ్యాయులు తలమునకలవుతున్నారు.

- ప్రధానోపాధ్యాయులపై భారం..

ఈ ఏడాది బడిబాట కార్యక్రమం ప్రధానో పాధ్యాయుల నెత్తిమీద గుదిబండలా మారిం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జనగణనలో ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమంలో ఎలా భాగస్వామ్యం చేయాలో అర్థం కావడం లేదని చెబుతున్నా రు. ఒకే సమయంలో రెండు విధులు నిర్వహించడమంటే వారి నుంచి ఎలాంటి ఆక్షేపణలు ఎదురవుతాయోనని హెచ్‌ఎంలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో బడి బాట కార్యక్రమం లక్ష్యం నెరవేరేనా అన్న అనుమానాలు ఉపాధ్యాయ వర్గా ల్లో వ్యక్తమ వుతున్నాయి. ప్రభుత్వం రెండు పనులూ ఒకే సారి అప్పగించడంతో హెచ్‌ఎంలు ఏం చే యాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

Updated Date - May 17 , 2026 | 10:18 PM