Share News

డబుల్‌ ఇళ్లలో ఉండాల్సిందే!

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:15 AM

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందిన లబ్ధిదారులు.. ఆ ఇళ్లలో నివాసం ఉండాల్సిందేనని, లేదంటే ఆ ఇళ్లను మరొకరికి కేటాయిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ఉండని 12 వేల మందిని గుర్తించి నోటీసులిచ్చామని, అయితే వారిలో 6వేల మంది మాత్రమే స్పందించారని తెలిపారు.

డబుల్‌ ఇళ్లలో ఉండాల్సిందే!

  • లేదంటే కేటాయింపు రద్దు చేసి మరొకరికి ఇస్తాం

  • నెలాఖరుకు 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి.. జూన్‌ నాటికి మరో లక్ష

  • ఇందిరమ్మ ఇళ్ల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌

  • శాసనసభలో మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందిన లబ్ధిదారులు.. ఆ ఇళ్లలో నివాసం ఉండాల్సిందేనని, లేదంటే ఆ ఇళ్లను మరొకరికి కేటాయిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ఉండని 12 వేల మందిని గుర్తించి నోటీసులిచ్చామని, అయితే వారిలో 6వేల మంది మాత్రమే స్పందించారని తెలిపారు. వారికి ఇచ్చిన రెండు నెలల గడువు పూర్తయిందని, ఆయా ఇళ్లలో నివాసం ఉండటానికి మరో రెండు నెలల గడువిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఇళ్లలోకి రాకపోతే కేటాయింపులు రద్దుచేసి, ఆ నివాస సముదాయాలకు 5-10 కిలోమీటర్ల లోపు నివాసం ఉండేవారికి ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో 22 మంది సభ్యులు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణాన్ని పూర్తిచేయడమే కాకుండా.. ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పాత రేట్లకు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకువస్తే వారికి నిధులు ఇస్తామని, లేదంటే ఇల్లు పొందిన లబ్ధిదారులే కట్టుకునేలా నిధులు మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని, దీనికి ఫోన్‌ చేసిన 24 గంటల్లోపు ఆ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.


పూర్తయిన ఇళ్లలో మౌలిక సదుపాయాల్లేవు..

గత ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రాంతానికి కేటాయించిన లక్ష ఇళ్లలో 78,861 ఇళ్లు పూర్తయినా.. మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. మరో 21,838 ఇళ్లు కేవలం పునాదులకే పరిమితమయ్యాయన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉండిపోయాయని, తాము కొత్తగా కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. మౌలిక సదుపాయాల కోసం రూ.738 కోట్లు కేటాయించామన్నారు. ఇక 2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం 23,500 ఇళ్లను కేటాయించిందని, అయితే నగరంలో వృత్తి వ్యాపారాలు చేసుకునేవారు సమారు 20-30 కిలోమీటర్ల దూరంలోని ఆ ఇళ్లలోకి రాలేదన్నారు. దీంతో 12 వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉండిపోయాయన్నారు. రెండు నెలల్లోగా వారు రాలేకపోతే ఆ ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయిస్తామన్నారు. జర్నలిస్టుల కాలనీలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో తొలి విడత 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా చెంచులకు, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12 వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. వివిధ కాలనీల్లో లీజుకిచ్చిన షాపులకు అద్దెలు సక్రమంగా చెల్లించడం లేదని, పైగా కోర్టులకు వెళ్తున్నందన అద్దెలు వసూలు కావడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సదరు షాపులను బహిరంగ వేలంలో విక్రయించి వచ్చిన డబ్బును ఆయా కాలనీ కమిటీ, ప్రభుత్వం పేరిట జమ చేసి వాటిపై వచ్చే వడ్డీతో విద్యుత్‌, లిఫ్ట్‌ తదితర అవసరాలకు ఖర్చు చేసేలా ప్రతిపాదించామని వివరించారు.

కమిటీలకు సర్పంచులే అధ్యక్షులు..

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు గ్రామాల్లో సర్పంచులు అధ్యక్షులుగా ఉంటారని పొంగులేటి తెలిపారు. వారి ఆధ్వర్యంలోని కమిటీ నిరుపేదలను ఎంపిక చేస్తే.. కలెక్టర్‌ పరిశీలన, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కేటాయింపులు జరుగుతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో నెలాఖరు నాటికి 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తికానున్నాయని, జూన్‌ నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే 14-15 స్థలాలను గుర్తించామని, దీనిపై పాలసీకి త్వరలో క్యాబినెట్‌ భేటీలో ఆమోదం తెలుపుతామని అన్నారు. ఇకపై ఇళ్ల కేటాయింపులను ఆ నివాస సముదాయాలకు 5-10 కిలోమీటర్ల లోపు నివాసం ఉండే వారికే చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 26 , 2026 | 05:15 AM