Share News

దోస్త్‌ తొలి విడతలో 56,147 మందికి సీట్లు

ABN , Publish Date - May 15 , 2026 | 04:46 AM

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ తొలి విడత జాబితా విడుదలైంది. మొదటి విడతలో మొత్తం 84,610 మంది రిజిస్టర్‌ చేసుకోగా....

దోస్త్‌ తొలి విడతలో 56,147 మందికి సీట్లు

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ తొలి విడత జాబితా విడుదలైంది. మొదటి విడతలో మొత్తం 84,610 మంది రిజిస్టర్‌ చేసుకోగా 61,543 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. 56,147 మందికి సీట్లు కేటాయించారు. 36,634 మంది మొదటి ప్రాధాన్యత (ఫస్ట్‌ ప్రియారిటీ)లో సీటు దక్కించుకోగా, 19,513 మంది రెండో ప్రాధాన్య (సెకండ్‌ ప్రియారిటీ)లో సీటు సాధించారు. ఈసారి కూడా కామర్స్‌ కోర్సుల్లోనే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. 23,214 మంది కామర్స్‌ కోర్సుల్లో సీటు సాధించగా, 14,394 మంది ఫిజికల్‌ సైన్స్‌, 9,815 మంది లైఫ్‌ సైన్స్‌, 8,415 మంది ఆర్ట్స్‌, 309 మంది ఇతర కోర్సుల్లో సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. సీట్లు పొందిన వారిలో 36,302 (65శాతం) మంది అమ్మాయిలు ఉండగా, 19,845 (35శాతం) మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌లో మొత్తం 777 కాలేజీలు ఉండగా 409 కోర్సుల్లో.. 3,60,709 సీట్లున్నాయి. మొదటివిడతలో 79 కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. మొదటి విడతలో సీటు ఖరారైన విద్యార్థులు ఈనెల 23లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవాలని దోస్త్‌ కన్వీనర్‌ బాలకిష్టారెడ్డి కోరారు.

Updated Date - May 15 , 2026 | 04:46 AM