Share News

kumaram bheem asifabad- చైనా మాంజా వాడొద్దు

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:28 PM

జిల్లాలో వాహనదారులు, పక్షుల ప్రాణాలు బలితీసు కునే అవకాశం ఉందనే నేపథ్యంలో చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి పిల్లలు, విద్యార్థులు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కానీ కొన్నేళ్లుగా నైలాన్‌ తరహా దారాలు, చైనా మాంజాతో పతంగుల ఎగురువేయడంతో దారాలు తగిలి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతున్న సంఘటనలు తలెత్తుతున్నాయి.

kumaram bheem asifabad- చైనా మాంజా వాడొద్దు
లోగో

- జిల్లా వ్యాప్తంగా దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

- విక్రయిస్తున్న వారిపై కేసులు

- కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాహనదారులు, పక్షుల ప్రాణాలు బలితీసు కునే అవకాశం ఉందనే నేపథ్యంలో చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి పిల్లలు, విద్యార్థులు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కానీ కొన్నేళ్లుగా నైలాన్‌ తరహా దారాలు, చైనా మాంజాతో పతంగుల ఎగురువేయడంతో దారాలు తగిలి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతున్న సంఘటనలు తలెత్తుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటా చైనా మాంజా, లేదా నైలాన్‌ దారాల అమ్మకాలపై పోలీసులు దృష్టి సారిస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున దాడులు చేసి చైనా మాంజా విక్రయదారులపై కేసులు నమెదు చేస్తున్నారు. చైనా మాంజా దారాలను, రీల్స్‌ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా, వాడకంపై నిషేధం విధించినా ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. చైనా మాంజాతో గాలిపటాలను ఎగురువేస్తుంటే ఆకాశంలో పక్షులకు తగిలి ప్రాణాలు కోల్పోయే లేదా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. పిల్లలు, వాహనదారులు గాయపడడం, పర్యావరణానికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని దీంతో మాంజా రవాణా, నిల్వ, విక్రయం, వినియోగం చేయొద్దనే ఎస్పీ నితికా పంత్‌ ఆదేశాలతో పోలీసులు జిల్లాలో నిఘా పెంచారు. చైనా మాంజా వాడకం వలన తీవ్ర ప్రమాదాలు చోటు చేసుకుంటాయని దీని వాడకంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. విక్రేతలు, కొనుగోలు దారులకు సరైన అవగాహన కల్పించడానికి జిల్లా పోలీసు శాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా మూడు కేసులు నమోదు చేసి 161 చైనా మాంజా రీల్స్‌, 13 మాంజా చెక్రీలు, రూ. 43,400 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగజ్‌నగర్‌లోని ఫైఓవర్‌ సమీపంలో నుంచి వస్తున్న ప్రయాణికుడికి మాంజా తగలడంతో శనివారం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు నిఘా మరింత పెంచారు.

- జిల్లా వ్యాప్తంగా కేసులు ఇలా..

- కాగజ్‌నగర్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గాంధీ చౌక్‌ ఏరియాలో గత నెలలోఓ దుకాణంలో ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తుండగా సీసీఎస్‌ పోలీసులు దాడి చేసి 44 రీల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వాజిద్‌ ఖాన్‌ అనే కేసు నమోదు చేశారు.

- ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ దుకాణంలోగత నెలలో చైనా మాంజా అక్రమంగా విక్రయిస్తుండగా సీసీఎస్‌ పోలీసులు దాడి చేసి 10 రీల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- ఈనెల 2న ప్రభుత్వ నిషేదిత మాంజాను అక్ర మంగా విక్రయిస్తున్న సమాచారంలో సీసీఎస్‌ పోలీసులు రెబ్బెన మండలం గోలేటికి చెందిన మల్లేష్‌ను పట్టుకున్నారు. తన కిరాణా షాపులు విక్రయిస్తున్న 57 చైనా మాంజా రీల్స్‌ స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

- శిక్షలు ఇలా..

బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 223, 125, 110 ప్రకారం చైనా మాంజా విక్రయిచండం నేరం అమ్మిన వారితో పాటు కొన్న, వాడిన వారిపైనా కేసులు నమోదు చేస్తారు. పర్యావరణ చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష రూ. 5 వేల వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్ట కింద 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా రెండు విధిస్తారు. దీంతో సీజనల్‌గా సాగే చైనా మాంజా విక్రయాలతో వ్యాపారులకు వచ్చే లాభాలు పక్కన పెడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చైనా మాంజా విక్రయాలపై సంబంధిత పోలీసులకు గానీ, లేదా 100కు డయల్‌ చేసి సమాచారం అందించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సూచనలు పాటిస్తే మేలు..

చైనా మాంజాపై నిషేధం ఉన్నందున సంప్రదాయ దారాన్ని మాత్రమే వినియోగించాలి. భవనాలు, మేడలు, ఇతర ఎత్తైన ప్రదేశాల నుంచి గాలి పటాలు ఎగురవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ పిట్టగోడ ఉన్నవి మాత్రమే ఎంచుకోవాలి. విద్యుత్తు స్తంభాలు, రహదారాలపై గాలి పటాలు ఎగురవేయకూడదు. మైదాన ప్రాంతా లే ఉత్తమం. పిల్లల వెంట తల్లిదండ్రులు ఉంటూ జాగ్రత్తలు తెలియజేయాలి. దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవు.

చైనా మాంజా విక్రయాలపై నిఘా..

- వహీదుద్దీన్‌, డిఎస్పీ, కాగజ్‌నగర్‌

మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టాం. చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమంగా విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తాం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ గమనించాలి.

Updated Date - Jan 12 , 2026 | 10:28 PM