Share News

kumaram bheem asifabad- తొందర వద్దు.. శోకం మిగల్చొద్దు..

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:39 PM

వినాయక చవితి అంటేనే గ్రామాల్లో సందడి వాతావరణం ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో అత్యంత భక్తితో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా వైభవంగా జరుపుకుంటారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎంత ఆనందం ఉంటుందో అప్రమత్తత లేకుంటే అదే స్థాయిలో అపాయం కూడా ఉంటుంది.

kumaram bheem asifabad- తొందర వద్దు.. శోకం మిగల్చొద్దు..
లోగో

- విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో అప్రమత్తత అవసరం

బెజ్జూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి అంటేనే గ్రామాల్లో సందడి వాతావరణం ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో అత్యంత భక్తితో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా వైభవంగా జరుపుకుంటారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎంత ఆనందం ఉంటుందో అప్రమత్తత లేకుంటే అదే స్థాయిలో అపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేయకుండా ఉంటుంది. వినాయక చవితి వేడుకలకు ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో గత ఏడాది సుమారు వెయ్యి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వినాయక చవితి వేడుకల్లో అజగ్రత్తగా ఉంటే అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. గత ఏడాది హైదరాబాద్‌లో కృష్టాష్టమి వేడుకల్లో శోభాయాత్ర రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది పాతబస్తి బండ్లగూడలో వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. ఇలా ప్రతిసారీ ఏదో ఒకచోట వినాయక చవితి వేడుకల్లో అపశృతులు దొర్లి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సారి నిర్వహించే వినాయక చవితి వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 14న వినాయక చవితి సందర్బంగా ఇప్పటికే జిల్లాలో నిర్వాహకులు గణనాథులను ప్రతిష్టించేందుకు సిద్ధమవుతుండగా జిల్లా పోలీసు యంత్రాంగం పలు సూచనలు చేసింది.

- జాగ్రత్తలు ఇలా..

మండపాల నిర్మాణాన్ని మండలి సభ్యులు విశాల ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. తడకలు, గుడ్డలకు బదులు అస్‌బెస్టాస్‌ రేకులతో ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనకరం. వీటి మూలంగా అగ్ని ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది. వర్షానికి విగ్రహాలు తడవకుండా ఉంటాయి. నిర్వాహణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రద్దీ అధికంగా ఉండే మండపాల వద్ద కాలనీవాసులు భక్తులు దర్శించుకొని వెళ్లేలా విశాలంగా బారులు ఉండాలి. విద్యుత్‌ అవసరాల కోసం వినియోగించే పరికరాలు, తీగలు ఇతరత్రా వస్తువులన్నీ ఐఎస్‌ఐ మార్కు కలిగిన వాటినే వినియోగించాలి. అతుకులు లేకుండా చర్యలు తీసుకోవాలి. దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.

- విగ్రహాల తరలింపులో..

వినాయక విగ్రహాల తరలింపు మార్గాల్లో విద్యుత్‌ తీగలను పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలి. వినాయక విగ్రహాలను దింపేటప్పుడు, మండపాల్లోకి తీసుకవెళ్లేటప్పుడు నీరు, అగ్ని నిరోదక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి.మండపాల నిర్వాహాకులు అత్యవసర సేవల నిమిత్తం 100,101,108నంబర్లను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలి.పోలీసు, అగ్నిమాపక, విద్యుత్‌, వైద్యాధికారి సెల్‌ నంబర్లను ఉంచుకోవాలి. జాగ్రత్త చర్యలు పాటించాలి. తరలింపు మార్గంతో పాటు మండపాల వద్ద విద్యుత్‌ తీగల పరిస్థితిని గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలి. విగ్రహం బరువు అధికంగా ఉంటే ట్రేన్‌ సహాయంతో కిందికి దించాలి. విగ్రహాలను తీసుకవచ్చే సమయంతో పాటు నిమజ్జనానికి తరలించే సమయంలో బాలలు వెంట ఉండకుండా చర్యలు తీసుకోవాలి. మండపాల్లో విద్యుత్‌ ప్రమాదాలకు తావు లేకుండా వైర్లను బిగించుకోవాలి. మండపాల సమీపంలో టపాసులు పేల్చడం చేయరాదు. గ్యాస్‌ సిలిండర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ మండపాల వద్ద ఉంచరాదు

జాగ్రత్తలు పాటించాలి..

- సర్తాజ్‌పాషా, ఎస్సై, బెజ్జూరు

వినాయక చవితి ఉత్సవాలకు నిర్వాహకులు జాగ్ర త్తలు పాటించాలి. వినాయక మండపాల నిర్వహణకు పోలీసులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకుంటాం. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా వండపాల నిర్వాహకులు తెలంగాణ పోలీసు శాఖ పోలీసు పోర్టల్‌. టీఎస్‌పోలీసు.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.

Updated Date - Sep 11 , 2026 | 11:40 PM