నా పేరు పెట్టినందుకు ‘థాంక్యూ’
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:04 AM
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు...
హైదరాబాద్‌లోని రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడి హర్షం
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నానక్‌రాంగూడలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి రాష్ట్ర ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ట్రంప్ శనివారం ఉదయం స్పందించారు. ‘భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ను ఏర్పాటు చేశారు. ఇలాంటి గౌరవం పొందిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. థాంక్యూ’’ అంటూ ట్రూత్ సోషల్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. యూఎస్ కాన్సులేట్‌లో జూన్ 23న జరిగిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ సమక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ నామఫలకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ఫొటోను ట్రంప్ తన వ్యాఖ్యలతో పాటు షేర్ చేశారు.