అత్యంత ప్రమాదకరంగా అన్నవాహిక క్యాన్సర్
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:12 AM
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఇసాఫజీయల్ క్యాన్సర్ (ఆహార నాళ / అన్నవాహిక క్యాన్సర్) ఒకటని వైద్యులు పేర్కొన్నారు..
ప్రతీ లక్ష జనాభాకు 6.5 కొత్త కేసులు
ధూమపానం, మద్యపానం, ఊబకాయమే కారణం
వేడివేడి పానీయాలు తాగడం వల్ల కూడా ముప్పు
ఐఎస్డీఈ అంతర్జాతీయ సదస్సు ఇండియా
ఎడిషన్-2026లో క్యాన్సర్ వైద్య నిపుణులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఇసాఫజీయల్ క్యాన్సర్ (ఆహార నాళ / అన్నవాహిక క్యాన్సర్) ఒకటని వైద్యులు పేర్కొన్నారు. భారతదేశంలో ఆహారనాళ క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, షోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లతోపాటు వేడివేడి పానీయాలు తాగడం కూడా ఈ క్యాన్సర్ బారిన పడడానికి కారణాలని తెలిపారు. ఇసాఫజీయల్ క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికతలు, పరిశోధనల్లో పురోగతులపై చర్చించేందుకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు (ఐఎస్డీఈ) ఇండియా ఎడిషన్ 2026 సదస్సులో క్యాన్సర్ వైద్య నిపుణులు ఈ మేరకు మాట్లాడారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఇసాఫగ్‌స(ఐఎస్డీఈ), బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (బీఐఏసీహెచ్, ఆర్‌ఐ) ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు హైదరాబాద్, మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైంది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్పు ప్రజెంటేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా క్యాన్సర్ చికిత్స, పరిశోధనలకు సంబంధించిన అంశాల్లో ఎవరూ ఊహించని వినూత్న ఆలోచనలకు వేదిక కావాలని ఆశిస్తున్నానని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. బీఐఏసీహెచ్ ఆర్‌ఐ మెడికల్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, ఐఏఎ్‌సఓ అధ్యక్షుడు డాక్టర్ టీ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ.. ఇసాఫజీయల్ క్యాన్సర్‌కు చికిత్స చేయడం సవాలు అన్నారు. ఈ క్యాన్సర్ బారిన పడిన ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల తగిన చికిత్స కూడా అందడం లేదన్నారు. కాగా, దేశంలో ప్రతీ లక్ష జనాభాకు సుమారు 6.5 ఇసాఫజీయల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఈ సదస్సులో పాల్గొన్న క్యాన్సర్ వైద్య నిపుణులు చెప్పారు. దేశంలో పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది 6వ స్థానం, మహిళలో 7వ స్థానంగా ఉందని పేర్కొన్నారు. అన్నవాహిక క్యాన్సర్ అనగానే కేవలం ఆహారం మింగలేకపోవడం మాత్రమే అనుకోవడం పొరపాటని సూచన చేశారు. మింగడంలో ఇబ్బందులు ఏర్పడితే అది కేవలం వయస్సు, గొంతు నొప్పితో వచ్చిందని సరిపెట్టుకోకుండా వెంటనే ఎండోస్కోపి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బోర్డ్ మెంబర్ నారా బ్రాహ్మణి, ఐఎ్‌సడీఈ అధ్యక్షులు ప్రొఫెసర్ లోరెంజో ఫెర్రీ, టాటా మెమోరియల్ హాస్పిటల్ (ముంబై) డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్, భారత్‌తోపాటు సింగపూర్, జపాన్ తదితర దేశాలకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.