Doctors Restore Heart Health: లయ తప్పిన గుండెకు కళ్లెం
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:12 AM
అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హృదయ స్పందనలో మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించారు
గుండె దడ, నొప్పితో ఇద్దరికి తీవ్ర ఇబ్బంది
చికిత్స చేసి స్వస్థత చేకూర్చిన నిమ్స్ వైద్యులు
నిమ్స్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హృదయ స్పందనలో మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించారు. శనివారం నిమ్స్ ఆస్పత్రిలో ఈ కేసుల వివరాలను నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సాయి సతీశ్ వెల్లడించారు. ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన నిరీష(31)కు ఏడాదిగా తరచూ గుండె నొప్పితో పాటు అధికంగా దడ వచ్చేది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎవరూ వ్యాధిని గుర్తించలేకపోయారు. నాగారానికి చెందిన ముదాసిర్(21)దీ ఇదే తరహా సమస్య. వీరిద్దరి గుండె 40 నుంచి 50 శాతం అధికంగా కొట్టుకోవడంతో గుండె నొప్పి, దడ, తలతిరగడం జరిగేవి. నిమ్స్ కార్డియాలజీ బృందం నిర్వహించిన పరీక్షల్లో గుండె లోపల విద్యుత్ ప్రసరణలో హెచ్చు తగ్గుల వల్ల ఈ సమస్య వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. ఇలా ఎక్కువ రోజులు కొనసాగితే గుండె కండరం బలహీనపడి ఎడమ జఠరిక(ఎల్‌వి) పనితీరు తగ్గిపోతుంది. అత్యాధునిక 3డీ ఎలకో్ట్ర-అనాటామికల్ మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్(ఆర్‌ఎ్‌ఫఏ) ద్వారా డాక్టర్లు చికిత్స నిర్వహించారు. ఇద్దరికి స్వస్థత చేకూర్చారు. చికిత్స నిర్వహించిన వారిలో డాక్టర్ హేమంత్, డాక్టర్ సునీత, డాక్టర్ సాయి రామ్ ఉన్నారు.