Share News

kumaram bheem asifabad- రోడ్లపై కూరగాయలు అమ్మొద్దు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:55 PM

రోడ్లపై కూరగాయలు అమ్మొద్దని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదని మున్సిపల్‌ అధికారులు సూచించారు. దీంంతో కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ మార్కెట్‌ చిరు వ్యాపారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా సర్‌సిల్క్‌లోని ప్రధాన రోడ్డుపై విక్రయిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం కమిషనర్‌ తిరుపతి ఆధ్వర్యంలో రోడ్లపై కూరగాయాలు విక్రయించకూడదని ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లోనే అమ్మకాలు జరుపాలని స్పష్టంగా సూచించారు.

kumaram bheem asifabad- రోడ్లపై కూరగాయలు అమ్మొద్దు
రాస్తారోకో చేస్తున్న చిరువ్యాపారులు (ఫైల్‌)

- ఇబ్బందులు పడుతున్నామని చిరువ్యాపారుల ఆవేదన

కాగజ్‌నగర్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రోడ్లపై కూరగాయలు అమ్మొద్దని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదని మున్సిపల్‌ అధికారులు సూచించారు. దీంంతో కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ మార్కెట్‌ చిరు వ్యాపారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా సర్‌సిల్క్‌లోని ప్రధాన రోడ్డుపై విక్రయిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం కమిషనర్‌ తిరుపతి ఆధ్వర్యంలో రోడ్లపై కూరగాయాలు విక్రయించకూడదని ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లోనే అమ్మకాలు జరుపాలని స్పష్టంగా సూచించారు. అయితే ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లో స్థలం కొరత, అక్రమంగా కబ్జాలు చేసి ఉండడంతో తమకు కూర్చునేందుకు వసతి లేదని దీంతో తాము రోడ్లపైనే విక్రయిస్తామని ఇటీవల చిరువ్యాపారులు రాస్తారోకో చేశారు. వీరి ఆందోళనకు పలువురు నాయకులు సైతం మద్దతు తెలిపారు.

- అధికారులతో చర్చలు..

ఈ మేరకు చిరువ్యాపారులు, అధికారుల మధ్య మున్సిపల్‌ కార్యాలయంలో చర్చలు సైతం చేపట్టారు. త్వరలోనే సమస్యను పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తాన చెప్పారు. కానీ ప్రస్తుతం చిరు వ్యాపారులు స్థానిక రాంమందిర్‌ సమీపంలో ఖాళీ స్థలంలో విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో ఈ ఏరియా అంతా బురదమయంగా మారింది. పక్కనే బురద నీరు ఉన్నప్పటికీ అక్కడే విక్రయాలు చేపట్టాల్సిపన పరిస్థితి నెలకొన్నది. తమకు పక్కా స్థలం లేక, తాత్కాలికంగా ఇక్కడ అమ్మకాలు చేపడుతున్నామని, బురదమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లోనే మటన్‌, చికెన్‌ దుకాణాలు ఉండడంతో ఇక్కడ అమ్మ కాలు జరిపితే శాఖాహారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. దీంతో తమ గిరాకీ పూర్తిగా పడిపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లో అక్రమంగా వేసిన దుకాణాలను తొలగించి తమకు అప్పగించాలని అధికారులను కోరుతున్నారు. గత వారం రోజులుగా అధికారులు, చిరు వ్యాపారుల మధ్య గొడవ జరుగుతుండటంతో తమకు పూర్తిగా గిరాకీలు లేక అల్లాడి పోతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా సర్‌సిల్క్‌ చిరువ్యాపారుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 11:55 PM