Share News

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:14 PM

సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి

-రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు చట్ట నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారి తనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని తెలిపారు. చట్ట ప్రకారం 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలని, గడవు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందన్నారు. ప్రతి అధికారి సమాచార హక్కు చట్టంలోని అన్ని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, అందిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలన్నారు. కమీషన్‌ ముందు అప్పీళ్ల పరిష్కార సమయంలో ప్రజా సమాచార అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ అందించిన సలహాలు, సూచనలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషనర్‌లు శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్‌, భూపాల్‌, అయోధ్యరెడ్డి, డీసీపీ భాస్కర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య,రాములు, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌,ఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:14 PM