విధుల్లో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:57 PM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల లక్ష్యం సాధించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.
వైద్యుల సమీక్షలో కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల లక్ష్యం సాధించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. డీఎంహెచ్‌వో మనోహర్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ ఆఫీసర్లు, మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) వైద్య ఆరోగ్య సిబ్బందితో కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, 99 పల్లె దవాఖానాల పరిధిలో జరిగిన ప్రసవాలను మండలాలవారీగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యం, ప్రసవాల లక్ష్యం, మందులు, సమయపాలన ఇతర అంశాలను అడిగి ప్రసవాల శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, వీణ, ప్రోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
బీబీనగర్: రెవెన్యూ సదస్సులలో వచ్చిన సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డితో సమావేశమై భూభారతి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. చిన్న చిన్న కారణాలు చూపి తిరస్కరించవద్దు, అర్హులైన వారందరికీ యాజమాన్య హక్కు లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు.
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి విధులకు హాజరైన సిబ్బంది గురించి ఆరాతీశారు. రోజుకు ఎంత మంది చికిత్స కోసం వస్తున్నారు వారిలో ఎందరు అడ్మిట్ అవుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మండలంలోని జైనపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.ఆయన వెంట తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వైద్య అధికారి మౌనిక రెడ్డి ఉన్నారు.