డీఎంహెచ్‌వో నొక్కుడు
ABN , Publish Date - May 31 , 2026 | 05:44 AM
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిన వ్యక్తి కుటుంబానికి దక్కిన పరిహారానికి కూడా ఎగనామం పెట్టటానికి జిల్లా వైద్యాధికారి ప్రయత్నించిన ఉదంతమిది.
గతంలో మృతుడి కుటుంబానికి ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి రూ.25 లక్షల పరిహారం
మధ్యవర్తిగా ఉండి రూ.15 లక్షలే ఇచ్చిన సంగారెడ్డి డీఎంహెచ్‌వో వసంతరావు
బదిలీపై వెళ్తుండగా నిలదీసిన బాధితులు
రూ.5 లక్షలు, మిగతా మొత్తానికి చెక్కు ఇచ్చిన అధికారి
సంగారెడ్డి అర్బన్, మే 30 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిన వ్యక్తి కుటుంబానికి దక్కిన పరిహారానికి కూడా ఎగనామం పెట్టటానికి జిల్లా వైద్యాధికారి ప్రయత్నించిన ఉదంతమిది. బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకోవటంతో ఇది బయటపడింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూర్ గ్రామానికి చెందిన వెల్పుగొండ వెంకటేశ్‌గౌడ్ (42) గత ఏడాది నవంబరులో ఛాతీనొప్పితో సంగారెడ్డి శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో అదే నెల 6వ తేదీన మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆయన మృతి చెందాడని కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో రూ.25 లక్షల పరిహారం ఇస్తామని ఆసుపత్రి నిర్వాహకులు కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ వసంతరావు మధ్యవర్తిగా వ్యవహరించారు. విడతల వారీగా రూ.25 లక్షలను వసంతరావుకు ఆస్పత్రి నిర్వాహకులు అందజేశారు. అయితే, వసంతరావు అందులో రూ.15 లక్షలు మాత్రమే తమకు ఇచ్చి, మిగతా పది లక్షలు ఇవ్వకుండా ఆరు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న మిగిలిన డబ్బులు కూడా ఇస్తానని హామీపత్రంతో పాటు చెక్కులు కూడా ఇచ్చారని తెలిపారు. కాగా, వసంతరావు బదిలీ అయ్యారని తెలుసుకున్న బాధితులు శనివారం డీఎంహెచ్‌వో ఆఫీసుకు వచ్చారు. కొత్త డీఎంహెచ్‌వోకు బాధ్యతలు అప్పగించి వసంతరావు వెళ్తున్న క్రమంలో ఆఫీసు గేటు వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పరిహారం డబ్బు పూర్తిగా చెల్లించే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో అక్కడ రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వసంతరావును బ్యాంకుకు తీసుకెళ్లి అప్పటికప్పుడు రూ.5 లక్షల నగదు, మరో రూ.5 లక్షలకు చెక్కును ఆయన నుంచి బాధితులు తీసుకున్నారు. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైంది.