బ్రేక్‌ఫాస్ట్ పథకానికి 22కోట్ల విరాళం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:45 AM
సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, అరబిందో ఫార్మా లిమిటెడ్ ఎండీ నిత్యానందరెడ్డి, హరేకృష్ణ ఫౌండేషన్..
సీఎస్ఆర్ కింద అందజేసిన దివీస్, అరబిందో సంస్థలు
సమీకృత కిచెన్ పరిసరాల్లోని రైతులను ఆదుకునేలా ప్రణాళిక
కూరగాయలు, బియ్యం వారి నుంచే సేకరణకు చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, అరబిందో ఫార్మా లిమిటెడ్ ఎండీ నిత్యానందరెడ్డి, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద దివీస్ సంస్థ రూ.12.18 కోట్లు, అరబిందో సంస్థ రూ.10 కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం అందించారు. ఈ మేరకు ఆ చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం కొన్నిచోట్ల సమీకృత వంటశాలలు ఏర్పాటు చేశామన్నారు. అయితే సమీకృత వంటశాలలు ఏర్పాటు చేసిన చోట పరిసర ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం తెలిపారు. ఆ వంటశాలలకు అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని ఆ రైతుల నుంచే నేరుగా సేకరించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాలను అందిస్తూ, వారిని సేంద్రియ వ్యవసాయం, పంటమార్పిడి వైపు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాగా సీఎ్‌సఆర్ ఫండ్‌ను అందించిన రెండు సంస్థలను సీఎం రేవంత్ అభినందించారు.