kumaram bheem asifabad- విమోచన పోరులో జిల్లా యోధులు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:15 PM
నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాంత సమర యోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్ మిటలరీ శిక్షణ క్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. మిలటరీ పంజాబ్ రేజిమెంట్ లేజర్ పీఎస్ గహున్ శిక్షణను అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్ శాస్ట్రి బేకర్, బల్లార్షా క్యాంపు ఇన్‌చార్జిగా కేవీ కేశవులు వ్యవహరించగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు.
- ఏడాది పాటు మిలటరీ శిక్షణ పొందిన జిల్లా వాసులు
- నేడు తెలంగాణ విమోచన దినం
ఆసిఫాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాంత సమర యోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్ మిటలరీ శిక్షణ క్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. మిలటరీ పంజాబ్ రేజిమెంట్ లేజర్ పీఎస్ గహున్ శిక్షణను అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్ శాస్ట్రి బేకర్, బల్లార్షా క్యాంపు ఇన్‌చార్జిగా కేవీ కేశవులు వ్యవహరించగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన చీల శంకర్, చీల విఠల్, కాండ్రె శంకర్, చందన్‌వార్ విఠల్, జగన్నాథ్, రేవయ్య, రాంసింగ్, నాగేంద్రయ్య, తిరుపతి, వెంకటేశంలు సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందుతూ సాయుధ పోరాటాన్ని నిర్వహించారు. రజాకార్లను మట్టుపెట్టి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన చరిత్ర ఘట్టాలు ఆసిఫాబాద్ ప్రాంతంలో కోకొళ్లలుగా ఉన్నాయి. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరచకాలతో సహనం కోల్పోయిన సామాన్య ప్రజలు సైతం స్వచ్ఛంద భారత సిపాయిలై తుపాకీ పట్టి సాయుధ పోరటం చేయడంతో నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించింది. స్వాతంత్య్ర భారత యూనియన్‌లో విలీనం కాకుండా ప్రత్యేక సంస్థానంగా కొనసాగుతామని మొండికేసిన నిజాం ప్రభుత్వం రజాకార్లను రెచ్చగొట్టి అఘాహిత్యాలకు ఉరికొల్పడం, బలవంతపు పన్నులు, వెట్టి చాకిరి విధానం, మహిళలపై అత్యాచారం, జాగీర్‌దార్లు, మత్తెదార్లకు ప్రోత్సాహం సామాన్య ప్రజానికానికి సహించని పరిస్థితి తెచ్చింది. ఇండియన్ యూనియన్‌లో కలవడానికి నిజాం మెడలు వంచి ఒప్పించేందుకు అవసరమైతే ప్రాణాలు తీసేందుకు జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాంత యోథులు అత్యంత కీలక పాత్ర పోషించారు.
- జిల్లా కేంద్రంగా ఆసిఫాబాద్..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా 1940 వరకు కొనసాగింది. ఈ సమయంలో పలువురు బ్రిటీష్ పాలన వ్యతిరేక పోరాటం, వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాలు, హిందీ మహాసభ ప్రచారం జరిపి జైలు జీవితం అనుభవించిన స్ఫూర్తితో 1947 నుంచి 1948 సంవత్సరాల్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాటం చేసేందుకు బీజం పోసింది. ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి చీల శంకర్, చీల విఠల్, రాంసింగ్, కాండ్రె శంకర్, రేవయ్య, నాగేంద్రయ్య, బోనగిరి వెంకటేశం, చందావార్ విఠల్, కాటెపల్లి తిరుపతి, జగన్నాథ్‌లు అజ్ఞాతంలోకి వెల్లి మహారాష్ట్రలోని చాందలో నిర్వహించిన సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది కాలం పాటు శిక్షణ పొందుతూ వివిధ సంఘటనల్లో పాల్గొన్నారు. భారత సైనిక దళాలకు అండగా ఉంటూ ప్రాణాలకు తెగించి రణరంగంలో దూకిన ఆసిఫాబాద్ సమరయోథులు నిజాం లొంగు బాటుకు దరూర్ రైల్వే స్టేషన్ విధ్వంసం చేసిన సంఘటనలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఆదేశాలతో 13.09.1948 పోలీసు యాక్షన్ ప్రకటితమైంది. మహారాష్ట్ర సైనిక దళాలు చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుక్షితులైన ఆసిఫాబాద్ యోథులు రజాకార్లను మట్టుపెట్టేందుకు ముందుకు సాగారు. ఈ పోరాటం హోరాహోరిగా జరిగింది. సెప్టెంబర్ 14న బల్లార్షా సాస్రి ప్రాంతంలో జరిగిన పోరాటంలో 10 మంది నిజాం వ్యతిరేక ఉద్యమ కారులు మరణించారు. సెప్టెంబర్ 15న సైనిక దళాలు మాణిక్‌ఘడ్ పోలీసు అవుట్ పోస్టుపై దాడి చేశారు. సెప్టెంబర్ 16న సిర్పూర్, బెజ్జూరు అవుట్ పోస్టులు భారత సైనిక పరమయ్యాయి. సెప్టెంబర్ 17న నిజాం సర్కార్ సైన్యానికి తలోగ్గి హైదరాబాద్ సంస్థాన్ భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్ 18న ఆసిఫాబాద్ జిల్లా జైలులోని 200 మంది ఖైదీలు గేట్లు విరగొట్టుకుని బయటకు వచ్చారు. నిజాం ప్రభుత్వాన్ని భారత దేశ సంస్థానంలో విలీనం చేసేందు కు ఆసిఫాబాద్ సమరయోధుల కృషి ఎంతో ఉంది.
- విరోచిత పోరాటం..
సమరయోధుల విరోచిత పోరాటం, భారత ప్రభుత్వ మిటరీ యాక్షన్ ఫలితంగా మనం నిజాం నిరంకుశత్వం నుంచి బయట పడ్డాం. సుదీర్ఘ పోరాటం, ఎందరో అమర వీరుల త్యాగఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అడ వుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాడు నిజాం నిలువు దోపిడీ వ్యవస్థ కొనసాగింది. రజాకార్ల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అరకపట్టి, మే పట్టి, మంచెపట్టి, బంచరాయి లాంటి పన్నులతో గిరిజన రైతులను దోచుకున్నారు. అడవి బిడ్డలకు అడవిపై హక్కులు లేవన్నారు. ఈ నేపథ్యంలో సాయుధ పోరుకు దిగిన కుమరం భీం నిజాంపై విరోచితంగా పోరాడి వీర మరణం పొందారు. జిల్లా గిరిజనుల్లో పోరాట స్ఫూర్తి నింపారు. గిరిజన హక్కుల కోసం తిరుగుబాటు నేర్పారు. భీం పోరాట స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో వందలాది మంది యువకులు నిజాంపై తుపాకీ ఎక్కు పెట్టారు. జిల్లాలో గిరిజన హక్కుల పోరాటం, భారత స్వాతంత్య్ర పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం చరిత్రలో ప్రముఖంగా నిలిచి పోయాయి. గొప్ప పోరాట నేపథ్యం ఉన్న జిల్లాలో స్వాతంత్య్ర పోరాటంలో హైదరాబాద్ విలీనం పోలీసు యాక్షన్‌లో కొండా లక్ష్మ ణ్ బాపూజీతో పాటు వందలాది మంది సమరయోధులు పోరాడి భావితరానికి స్పూర్తిగా నిలిచారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు నిజాం నిరంకుశత్వం నుంచి హైదరాబాద్ విలీన సాయుధ పోరులో కొండాలక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారు.