Share News

చైర్మన్‌ పదవి అడిగితే.. ‘బీసీవి నీకెందుకిస్తాం’అన్నారు

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:08 AM

తాను మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి ఎంపీటీసీగా గెలిచిన సీనియర్‌ నాయకుడినని, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి తనకు ఇవ్వాలని కోరగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ....

చైర్మన్‌ పదవి అడిగితే.. ‘బీసీవి నీకెందుకిస్తాం’అన్నారు

  • బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి హేళన చేశారు

  • ఆయన కుమారుడు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు

  • హైకోర్టుకు తెలిపిన కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి.. ‘హెబియస్‌ కార్ప్‌స’తో కోర్టు ముందుకు

  • ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికపై స్టే ఎత్తేసిన హైకోర్టు

హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): తాను మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి ఎంపీటీసీగా గెలిచిన సీనియర్‌ నాయకుడినని, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి తనకు ఇవ్వాలని కోరగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి హేళన చేశారని 19వ వార్డు కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు విన్నవించారు. ‘చైర్మన్‌ పదవి ఈసారి ఓసీలకు కేటాయించారు. బీసీవైన నీకెందుకు ఇస్తామ’ని ఎగతాళి చేశారని చెప్పారు. తనను బలవంతంగా ఏపీలోని చీరాల వద్ద రిసార్ట్‌కు తరలించడంతో పాటు తన ఫోన్‌, కౌన్సిలర్‌గా ఎన్నికైన ధ్రువీకరణ పత్రం లాక్కున్నారని పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎ్‌సతోనే ఉన్నానని, తన ఇష్టప్రకారమే రిసార్ట్‌కు వెళ్లానని తనతో బలవంతంగా మీడియాకు చెప్పించారని తెలిపారు. పారదర్శక విధానంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. యాదగిరిని కిడ్నాప్‌ చేశారంటూ ఆయన కుమారుడు హరికాంత్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడం, దానిపై మంగళవారం జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టి యాదగిరిని బుధవారం తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం యాదగిరిని పోలీసులు ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు. యాదగిరి మాట్లాడుతూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌ రెడ్డి తనను బలవంతంగా తీసుకెళ్లారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులో తిప్పుతూనే ఉన్నారని, తాను షుగరు, బీపీతో బాధపడుతున్నా సరైన వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. మరోవైపు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ యాదగిరి స్వయంగా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్నారని, తన ఇష్టపూర్వకంగానే రిసార్ట్‌కు వెళ్లినట్లు మీడియాకు చెప్పి ఇప్పుడు వైఖరి ఎందుకు మార్చుకున్నారో అర్థం కావడం లేదన్నారు. మంగళవారమే చైర్మన్‌ ఎన్నిక పూర్తయిందని, ఒక బీజేపీ, ఒక స్వతంత్ర సభ్యుడి ఓటుతో తమకు మెజారిటీ వచ్చిందని, యాదగిరి ఓటు వేయకపోయినా మెజారిటీ వచ్చేదని పేర్కొన్నారు.


ఓటింగ్‌కు 24మంది వార్డు కౌన్సిలర్లు హాజరుకాగా, వారిలో 15 మంది (యాదగిరితో సహా) చేతులెత్తి బీఆర్‌ఎస్‌ 7వ వార్డు సభ్యుడు టేకుల సుదర్శన్‌ రెడ్డిని ఎన్నుకున్నారని తెలిపారు. ఇంప్లీడ్‌ అయిన వైస్‌ చైర్మన్‌ అభ్యర్థి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ వాదిస్తూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ ఉద్దేశం నెరవేరిందని, మరే ఇతర వివాదాలు వినరాదని కోరారు. డిటెన్యూ (యాదగిరి) తమ ఎదుట హాజరైన నేపథ్యంలో ఆయన తన ఇష్టప్రకారం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. ‘ఎన్నిక ముగిసే వరకు ఆయనను ఎవరూ బలవంతం చేయకుండా, ఆయన ఫోన్‌, ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఆయనకు ఇచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాల’ని ఆదేశించింది. చైర్మన్‌ ఎన్నికపై స్టే ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ విచారణను ముగించింది. ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌ నిర్ణయం మేరకు తదుపరి ఎన్నిక నిర్వహించవచ్చని తెలిపింది. కాగా, మంగళవారం చైర్మన్‌ ఎన్నిక పూర్తిచేసి, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు స్టే విధించినట్లు అడ్వకేట్‌ జనరల్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఎన్నికల అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - Feb 19 , 2026 | 05:08 AM