Share News

Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలపై సర్కారుతో అమీతుమీ!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:29 AM

ళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సంస్థలు సర్కారుతో అమీతుమీకి సిద్ధమయ్యాయి. బ్యారేజీల డిజైన్‌లలోనే లోపాలు ఉన్నాయని, బ్యారేజీలు కట్టి రిజర్వాయర్లుగా వినియోగించడమే వాటి వైఫల్యానికి కారణమని, నీటి నిల్వ నిర్ణయాలన్నీ మాజీ సీఎంవేనని నివేదికలు చెప్పడంతో ఇదే అంశాన్ని నిర్మాణ సంస్థలు బలంగా పట్టుకున్నాయి.

Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలపై సర్కారుతో అమీతుమీ!

  • తమ బాధ్యత ఏమీ లేదని సర్కారుకు మౌఖికంగా తేల్చిచెప్పిన నిర్మాణ సంస్థలు

  • క్రిమినల్‌ కేసులకు లొంగేది లేదని.. న్యాయపోరాటానికి సిద్ధమని సంకేతాలు

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సంస్థలు సర్కారుతో అమీతుమీకి సిద్ధమయ్యాయి. బ్యారేజీల డిజైన్‌లలోనే లోపాలు ఉన్నాయని, బ్యారేజీలు కట్టి రిజర్వాయర్లుగా వినియోగించడమే వాటి వైఫల్యానికి కారణమని, నీటి నిల్వ నిర్ణయాలన్నీ మాజీ సీఎంవేనని నివేదికలు చెప్పడంతో ఇదే అంశాన్ని నిర్మాణ సంస్థలు బలంగా పట్టుకున్నాయి. తమ బాధ్యత ఏమీ లేదని మౌఖికంగా ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ప్రభుత్వం పెట్టే క్రిమినల్‌ కేసులకు లొంగేది లేదని, న్యాయపోరాటానికి సిద్ధమనే సంకేతాలను ఇచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు/పునరుద్ధరణ కోసం ఏ పనులు చేయాలన్నా కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీయే కారణమని, ఆ బ్యారేజీ పునరుద్ధరణకు సొంత నిధులతో బాధ్యతలు తీసుకోకపోతే సంస్థపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక, నోటీసు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థలకూ ఇవే నోటీసులు ఇచ్చారు. వీటిలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు చిన్నవే ఉన్నాయి. అన్నారం డౌన్‌స్ట్రీమ్‌లో స్టిల్లింగ్‌ బేసిన్‌(గేట్ల నుంచి విడుదలయ్యే వరద పడే ప్రాంతం) విస్తరణ, ఇతర రక్షణ చర్యలు తీసుకుంటే బ్యారేజీ పూర్వస్థితికి చేరుకుంటుందని గుర్తించారు. సుందిళ్లలో సీపేజీల కట్టడితో పాటు బ్యారేజీ దిగువ భాగంలో రక్షణ చర్యలు తీసుకుంటే అది వినియోగంలోకి వస్తుందని తేల్చారు. మేడిగడ్డతోనే ప్రభుత్వానికి సమస్య వచ్చిపడింది. ఎల్‌ అండ్‌ టీపై క్రిమినల్‌ కేసు పెట్టి... బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థ నుంచి రాబట్టుకోవాలని కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి ఇప్పటికే సిఫారసు చేసింది. అంతకు ముందు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే నిర్మాణ సంస్థలు అమీతుమీకి సిద్ధం కావడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. కాగా.. వానాకాలం తర్వాత పరీక్షల కోసం బ్యారేజీల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటూనే.. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు పూర్తయ్యాయని గత ప్రభుత్వమే సర్టిఫికెట్లు జారీ చేయడం, డిఫెక్ట్‌ లయబిలిటీ కాలం కూడా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తికావడంతో చేసేదేమీ లేక నిర్మాణ సంస్థలతోనే బ్యారేజీల మరమ్మతులు చేయించే పనిలో అధికారులు పడ్డారు.

Updated Date - Jan 20 , 2026 | 02:29 AM