Share News

Bhubharathi portal: రూ.9 వేలకు రశీదు..ఖజానాలో జమ రూ.900!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:33 AM

భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఖజానాలో జమకాకుండా..

Bhubharathi portal: రూ.9 వేలకు రశీదు..ఖజానాలో జమ రూ.900!

  • ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లింపులో అక్రమాలు.. మీసేవ, స్లాట్‌ బుకింగ్‌ కేంద్రాల నిర్వాహకుల మాయాజాలం

  • చార్జీల సొమ్ములో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి..

  • మిగతాది సొంత ఖాతాల్లోకి..

  • జనగామలో బహిర్గతం.. ఒక్కరోజే రూ.8లక్షలు గల్లంతు

  • విచారణ చేపట్టిన అధికారులు

  • ఓ మీసేవ నిర్వాహకుడు సహా ముగ్గురు అదుపులోకి!

  • రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు?

జనగామ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఖజానాలో జమకాకుండా.. కొందరు మీసేవ, స్లాట్‌ బుకింగ్‌ కేంద్రాల నిర్వాహకులు జేబుల్లోకి చేరుతోంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానా రశీదులపై చెల్లించే మొత్తం సరిగానే ఉంటున్నా.. ప్రభుత్వ ఖజానా (ట్రెజరీ)లో మాత్రం అతితక్కువగా ఉంటోం ది. ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి పోర్టల్‌లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. జనగామ జిల్లాలో ఒక్క రోజులోనే రూ.8 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు తెలిసింది. దీనిపై గుట్టుగా విచారణ చేపట్టిన అధికారులు.. ఒక మీసేవ నిర్వాహకుడు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మరెంతగా అవకతవకలు జరిగి ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.


చివరిలో అంకెలను తొలగించి..!

భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం భూభారతి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. భూముల లావాదేవీలు జరిపేవారు సిటిజన్‌ పోర్టల్‌లోకి వెళ్లి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను చెల్లించి.. స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. కానీ సరైన అవగాహన లేక, తగిన సమయానికి సంబంధించిన స్లాట్‌ దొరకక.. చాలా మంది మీసేవ కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉండే స్లాట్‌ బుకింగ్‌ కేంద్రాల (డాక్యుమెంట్‌ రైటర్లు)ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు నిర్వాహకులు.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. భూమి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీల్లో మోసానికి పాల్పడుతున్నారు. భూమిని కొనుగోలు చేసే వ్యక్తి స్లాట్‌ బుక్‌ చేసుకొని, రిజిస్ట్రేషన్‌ చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించి.. సంబంధిత పత్రాలు, రశీదులను తీసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళతారు. అక్కడ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. అయితే కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం రశీదులపై సరిగానే కనిపిస్తున్నా.. ప్రభుత్వ ఖజానాలో మాత్రం తక్కువగా జమ అవుతున్నట్టు బయటపడింది. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కలిపి రూ.9,000 చెల్లిస్తే.. ఖజానాలో రూ.900 మాత్రమే జమ అవుతోంది. మీసేవ, స్లాట్‌ బుకింగ్‌ కేంద్రాల నిర్వాహకులు.. చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించిన సంఖ్యలో చివరి ఒకట్రెండు అంకెలను తొలగించి, ఖజానాకు జమయ్యేలా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మిగతా సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్టు తేల్చారు. అయితే భూభారతి పోర్టల్‌ను హ్యాక్‌ చేసి ఇలా చేస్తున్నారా? మరే మార్గంలో ఇలా చేశారన్న వివరాలు పూర్తిస్థాయి విచారణ తర్వాత బయటికి రానున్నాయి. ఓ ప్రత్యేకమైన ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు తక్కువ మొత్తంలో, వ్యక్తిగత ఖాతాలకు ఎక్కువ మొత్తంలో వెళ్లేలా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

జనగామలో ఒక్క రోజే రూ.8 లక్షలు తేడా!

స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్ము జమలో తేడాను ఇటీవల జనగామ జిల్లా అధికారులు గుర్తించినట్టు సమాచారం. రశీదుల మేరకు రావాల్సిన మొత్తంకన్నా.. చాలా తక్కువగా ఖజానాలో జమ అయినట్టుగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, పోలీసులు గుట్టుగా విచారణ చేపట్టారని.. జనగామ జిల్లాకు చెందిన ఇద్దరితోపాటు పక్క జిల్లాకు చెందిన ఒక మీసేవ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం కేవలం జనగామ జిల్లాలోనే జరిగిందా? మిగతా జిల్లాల్లోనూ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. సీసీఎల్‌ఏ అధికారులకు కూడా ఈ వ్యవహారంపై సమాచారం అందించినట్టు తెలిసింది. అక్రమాలు బయటపడిన నేపథ్యంలో జనగామ తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్‌ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమాల అంశంపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా వారు స్పందించలేదు.

Updated Date - Jan 09 , 2026 | 04:33 AM