Share News

kumaram bheem asifabad- క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం

ABN , Publish Date - Oct 11 , 2026 | 10:29 PM

యువతకు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఎంపీ నగేష్‌ అన్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆదర్శ క్రీడా పాఠశాలలో కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికాపంత్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2026 పోటీలను ఆదివారం ఎంపీ నగేష్‌ ప్రారంభించారు.

kumaram bheem asifabad- క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం
:జెండా ఊపి క్రీడలను ప్రారంభిస్తున్న ఎంపీ నగేష్‌ పాల్గొన్న కుమరం భీం జిల్లా కలెక్టర్‌ హరిత, అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): యువతకు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఎంపీ నగేష్‌ అన్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆదర్శ క్రీడా పాఠశాలలో కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికాపంత్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2026 పోటీలను ఆదివారం ఎంపీ నగేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ జిల్లాగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని 32 జిల్లాలనుంచి క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. క్రీడలు శారీరక ధృడత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, స్నేహభావం లక్ష్య సాధనకు దోహదపడతయన్నారు. చిన్న వయస్సు నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం ద్వారా క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం లభిస్తుందని వివరించారు. ఇందుకు చాంపియన్‌షిప్‌ పోటీలు ఒక వేదిక అన్నారు. అనంతరం కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలతో విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. క్రీడాకారులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన క్రీడకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇలాంటి రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ ద్వారా యువ క్రీడాకారులకు తమ ప్రతిభ చాటుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యసాధన వంటి విలువలను నేర్పుతాయన్నారు. ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏర్పాటుచేసిన మన ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇలాంటి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో ఇలాంటి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరుగడం వల్ల ఇక్కడి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సహం లభిస్తుందన్నారు. ఈ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి 1,200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఐటీడీఏ పీవో మంద మకరందు పోటీలను పరిశీలించారు. అనంతరం ఆయా పోటీల్లో విజయం సాధించిన వారికి జ్ఞాపికలు, బహుమతులు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడుధోని శ్రీశైలం, ఏపీవో అత్రం భాస్కర్‌, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఉమ్మడి జిల్లా క్రీడాధికారి పార్థసారథి, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొట్నాక విజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు పుర్క ఉద్దవ్‌, జిల్లా క్రీడల అధికారి మడావి శేకు తదితరులు పాల్గొన్నారు.

చాంపిషన్‌గా నిలిచిన కుమరం భీం జిల్లా

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆదర్శ క్రీడా పాఠశాలలో ఆదివారం జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌-2026లో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడా పోటీల్లో 32 జిల్లాలకు చెందిన సుమారు 1,200 మంది క్రీడాకారులు పాల్గొనగా రన్నింగ్‌, 400, 600మీటీర్లు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, బ్యాక్‌ త్రోలతో కలిపి 28 ఆంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో ప్రథమ స్థానంలో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గెలుపొందింది. నాలుగు బంగారు పథకాలు, రెండు, వెండి, ఆరు కాంస్య పతకాలు సాధించారు. రెండో స్థానంలో ములుగు జిల్లా గెలుపొందగా నాలుగు బంగారు, మూడు సిల్వర్‌, రెండు కాంస్య పతకాలు సాధించారు. మూడో స్థానంలో మేడ్చల్‌ మల్కజ్‌గిరి ఒకటి బంగారు, నాలుగు సిల్వర్‌ సాధించారు. గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులు, ట్రోఫీలను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్‌కుమార్‌ అందించారు.

Updated Date - Oct 11 , 2026 | 10:29 PM