Share News

పాకుతూ మెట్లెక్కుతూ దిగుతూ..

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:27 AM

హైదరాబాద్‌ చంపాపేటలోని దివ్యాంగ విద్యార్థుల హాస్టల్‌ 26 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఇక్కడ 195 మంది విద్యార్థులున్నారు.

పాకుతూ మెట్లెక్కుతూ దిగుతూ..

  • హాస్టళ్లలో దివ్యాంగ విద్యార్థుల అవస్థలు

  • అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలు కరువు

  • లిఫ్ట్‌లు, ర్యాంపులు లేవు.. డ్రైనేజీ కంపు

  • రెండేళ్లుగా డ్రెస్‌ అలవెన్సులూ బంద్‌

  • నాణ్యమైన తిండిలేక అనారోగ్యం పాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ చంపాపేటలోని దివ్యాంగ విద్యార్థుల హాస్టల్‌ 26 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఇక్కడ 195 మంది విద్యార్థులున్నారు. మూడో అంతస్తులో వసతి గృహం ఉంటే.. గ్రౌండ్‌ప్లోర్‌లో డైనింగ్‌ హాల్‌ ను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌గానీ, ర్యాంప్‌గానీ లేకపోవడంతో భోజనం చేసేందుకు దివ్యాంగ విద్యార్థులు పాకుతూ మెట్లు దిగి.. పాకుతూనే మెట్లు ఎక్కి తమ గదికి చేరుకోవాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థుల హాస్టళ్లు 22 ఉన్నాయి. ఓ రెండు చోట్ల మినహా అన్ని భవనాల్లో ‘చంపాపేట హాస్టల్‌’ మాదిరి దయనీయ పరిస్థితులే నెలకొన్నాయి. ఫలితంగా దివ్యాంగ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం అనేది కేవలం కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికలాంగుల చట్టం-2016 ప్రకారం.. హాస్టల్‌కు ప్రభుత్వ భవనం కేటాయించాలి. అది దివ్యాంగులకు పూర్తి అనుకూలంగా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఆరు, రంగారెడ్డిలోని ఆరు హోమ్‌లతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున వికలాంగుల వసతి గృహం ఉంది. వీటిలో ఒకట్రెండు చోట్ల మినహా అన్ని హోమ్స్‌, హాస్టళ్లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ భవనాల్లో కిటికీలు, తలుపులు పగిలిపోయి ఉన్నాయి. డ్రైనేజీ లీకేజీల వల్ల వచ్చే దుర్వాసనతో విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో సమస్యలు పరిష్కారం అవడంలేదు. హోమ్‌లో విద్యార్థి ఒకసారి ప్రవేశం పొందితే.. ఉద్యోగం వచ్చేవరకు ఆశ్రయం ఇస్తామన్న హామీ బాగానే ఉన్నా అక్కడ వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ నుంచి పీజీ వరకు సుమారు 7వేల మందికిపైగా దివ్యాంగ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు కాస్మెటిక్‌ చార్జీల కింద బాలురకైతే నెలకు రూ.250, బాలికలకైతే రూ.300 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత మూడేళ్లుగా పైసా విడుదల కాలేదు. ఆ విద్యార్థులకు డ్రెస్‌ అలవెన్స్‌ కింద ఏటా రూ.3వేల చొప్పున ఇవ్వాలి. ఇవి గత రెండేళ్లుగా ఇవ్వడం లేదు. 2018 నుంచి మెస్‌ చార్జీలను పెంచలేదు. ఉస్మానియా వంటి వర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు చెందిన విద్యార్థులకు నెలకు రూ.8వేలకుపైగా అందుతుండగా.. దివ్యాంగులకు మాత్రం రూ..2వేలతోనే సరిపెడుతున్నారు. దీంతో వారికి నాణ్యమైన భోజనం అందక అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కాస్మెటిక్‌, డ్రెస్‌ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని, ప్రస్తుత ధరలకనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని. వసతి గృహాల్లో లిఫ్ట్‌, ర్యాంప్‌ సదుపాయాలు కల్పించాలని, సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని దివ్యాంగ విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:27 AM