Share News

దివ్యాంగులకు ఊతమివ్వని సర్కారు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:48 AM

ఆధునికీకరణ దిశగా అడుగలు వేసి దివ్యాంగులకు ఊతమివ్వాల్సిన సర్కారీ కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి.

దివ్యాంగులకు ఊతమివ్వని సర్కారు

  • కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రాల మూసివేత

  • సంకటంగా కొత్త కాలిపర్ల కొనుగోలు

  • సర్కారులో 40 ఏళ్ల నాటి మోడళ్లే శరణ్యం

  • ప్రైవేటులో అత్యాధునిక పరికరాలు లభ్యం

  • ఇబ్బందుల్లో 8 లక్షల మంది దివ్యాంగులు

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఆధునికీకరణ దిశగా అడుగలు వేసి దివ్యాంగులకు ఊతమివ్వాల్సిన సర్కారీ కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. వీటికి నిధులిచ్చి చేయూతగా నిలవాల్సిన వికలాంగుల సహకార సంస్థ మొండిచెయ్యి చూపిస్తోంది. దీంతో అధునాతన పరికరాలకు రూపుదిద్దాల్సిన ఈ కేంద్రాలను సిబ్బంది కొరత, ముడి సరుకు, నిధుల లేమి వంటి మౌలిక సమస్యలు వేధిస్తున్నాయి.. ప్రభుత్వ పింఛన్‌ పొందుతున్న 4.5 లక్షల మందితో కలిపి రాష్ట్రంలోని 8 లక్షల మంది దివ్యాంగుల్లో అత్యధికులకు కృత్రిమ అవయవాలు అవసరం. దిక్కుతోచని స్థితిలో వేలమంది దివ్యాంగులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఒకప్పుడు ఈ కేంద్రాల్లో రకరకాల క్యాలిపర్లు, ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ తయారీ కోసం 50-60 మంది నిష్ణాతులైన ఉద్యోగులుండే వారు. కొందరి ఉద్యోగ విరమణానంతరం కొత్త నియామకాల మాటెత్తడం లేదు. 100 మందికి పైగా ప్రమాద బాధితులకు కృత్రిమ అవయవాల తయారీ కోసం నిమ్స్‌కు సర్కారు ఏటా నిధులు విడుదల చేస్తోంది. అత్యాధునిక క్యాలిపర్స్‌ చేసే టెక్నీషియన్లు లేరన్న సాకుతో కొందరు నిమ్స్‌ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు టెండర్‌ ద్వారా ఆర్డర్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ టెక్నీషియన్‌ రిటైరయ్యాక నిర్వహణ భారం సాకుతో 2021లోనే నల్లగొండ కేంద్రం శాశ్వతంగా మూత పడింది. నాలుగేళ్ల క్రితం నెల రోజుల కోసం ఒకరు గాంధీ ఆస్పత్రికి డిప్యుటేషన్‌పై వెళ్లగా, మరొకరు రిటైర్‌ అవడంతో మహబూబ్‌నగర్‌ కేంద్రానికి సైతం తలుపులు మూసుకున్నాయి. గాంధీలో ఒకరు, వరంగల్‌లో ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నా ముడి సరుకు అందకపోవడంతో ఇవీ పని చేయడంలేదు. అరిగిపోయిన క్యాలిపర్లకు మరమ్మతు చేసే దిక్కులేక దివ్యాంగులు నరకయాతన పడుతున్నారు. పరుగు పందెంలోనూ పాల్గొనగలిగే సత్తా ఉన్న ‘బిలోనీ’ వంటి అత్యాధునికమైనవి మార్కెట్లోకి వచ్చినా.. ప్రభుత్వ కేంద్రాల్లో 40 ఏళ్ల నాటి జైపూర్‌ మోడల్‌వే తయారు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫాక్చర్‌ యూనిట్లను(ఏఎల్‌ఎంయూ)పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సర్కారు ఆదేశాలతో ప్రతిపాదనలు పంపామని దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ తెలిపారు.

Updated Date - Mar 11 , 2026 | 04:48 AM