దిమాగీ నక్సల్స్ అన్నందుకు గర్విస్తున్నాం
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:35 AM
అన్యాయాన్ని ప్రశ్నించే తమను దిమాగీ నక్సల్స్(మేధో నక్సల్స్)గా ప్రధాని మోదీ అభివర్ణించినందుకు గర్విస్తున్నామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్..
ప్రధాని మాటలకు భయపడేదే లేదు: విద్యార్థుల నేత నేహాబోరా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 16 (ఆంద్రజ్యోతి): అన్యాయాన్ని ప్రశ్నించే తమను దిమాగీ నక్సల్స్(మేధో నక్సల్స్)గా ప్రధాని మోదీ అభివర్ణించినందుకు గర్విస్తున్నామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు, జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన నేహా బోరా అన్నారు. మేధో నక్సల్స్ అన్నంత మాత్రాన తాము భయపడతామనుకుంటే పొరపాటేనన్నారు. ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ కారుడు హసన్ 15వ స్మారకోపన్యాసం ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై నేహా బోరా మాట్లాడారు. నియంతృత్వ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం విద్యార్థులు, యువత కలసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని.. మేధావులు, కవులు, రచయితలపై అక్రమ నిర్బంధాలు ఎత్తివేసి, వారందరినీ గౌరవంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.